గంజాయి వంటి మత్తు పదార్ధాలను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించండి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్
చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం లో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు


చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం రాత్రి కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నార్కోటిక్స్ డాగ్స్ బృందాలను కూడా ఈ తనిఖీలకు ఉపయోగించారు.అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాల గురించి వివరించారు.తల్లీదండ్రులు తమ పిల్లల కదలికలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు.ఎంతో మంది యువకులు మత్తుకు బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు.ఎవరైనా గంజాయిని అమ్మినా,రవాణా చేసినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది స్థానికులు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం ప్రతిజ్ఞ చేశారు