చర్చ, కమాన్ పూర్: మంథని మానేరు పై ఆరెంద–దామెరకుంట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 203 కోట్లు మంజూరు
హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 203 కోట్లు మంజూరు చేయించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు
మంథని మండలంలోని మానేరు నదిపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ నిధులను ఆర్ అండ్ బి (R&B) శాఖ ద్వారా మంజూరు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 1.120 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. అలాగే ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ గ్రామాల నుంచి బ్రిడ్జి వరకు మరియు అటు వైపు దామెరకుంట రోడ్డు వరకు మొత్తం 9.530 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ రోడ్లు కమ్ రోడ్డు నిర్మించనున్నారు.ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంథని మండలంతో పాటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. కాలేశ్వరం దేవాలయానికి వెళ్లే దూరం సుమారు 25 కిలోమీటర్లు తగ్గనుండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం, ఇతర జిల్లాలు, మహారాష్ట్రకు రవాణా మరింత సులభమవుతుంది. దీంతో పాటు కాలేశ్వరం టూరిజం అభివృద్ధికి కూడా దోహదపడనుంది.
అలాగే ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామెరకుంట గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు వైద్య, విద్యా అవసరాలకు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడనుంది. పెద్దపల్లి–జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య కనెక్టివిటీ మరింత బలపడనుంది.
మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.