News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: తండ్రి మృతికి కారణమైన వారిని శిక్షించాలని కూతురి ధర్నా..

వ్యక్తిని కారుతో గుద్దిన ప్రియదర్శిని కాలేజీ డైరెక్టర్ చలపతిరావు..

 

  • మృతి చెందిన సాల్మన్ రాజ్ అనే దళితుడు…
  • పరారీలో ప్రియదర్శిని కాలేజీ డైరెక్టర్ చలపతిరావు..
  • న్యాయం కోసం బాధితులు కాలేజీ ముందు ధర్నా.
  • బాధితులను ఒప్పించేందుకు పోలీసుల ప్రయత్నం..
  • బాధితుల పక్షాన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు..
  • కుటుంబానికి మద్దతిచ్చిన దళితు సంఘాలు..

తన తండ్రి మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించాలని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఓ దళిత బిడ్డ సంఘవి (మృతుని కుమార్తె )పోరాటం చేస్తుంది. ఆమె పోరాటానికి దళిత సంఘాల నేతలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దతునిచ్చారు.

వివరాల్లోకి వెళితే రామాంజనేయ కాలనీకి చెందిన సంగయ్య ఎలియాస్ సాల్మన్ రాజు కొత్తగూడెం ఎంజీ రోడ్ దుర్గా టెక్స్ టైల్స్ లో పనిచేస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం విద్యానగర్ కాలనీలో మూడు గంటల ప్రాంతంలో రోడ్డుపై పడిపోయి ఉండగా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ డైరెక్టర్ అతనిపై నుంచి కారును పోనిచ్చి అతని చావుకు కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో అతనిపై చుంచుపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు.
నిర్లక్ష్యంగా వ్యక్తిని కారుతో గుద్ది అతనిపై నుంచి కారును పోనిచ్చి అతని చావుకు కారణమైన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు మంగళవారం హెచ్చరించారు. కారు యజమాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రియదర్శిని కాలేజీ డైరెక్టర్ శ్రీ రామనేని చలపతిరావు సోమవారం వ్యక్తి మరణించిన అనంతరం కారణం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి వెళ్లిపోయినాడు. కనీసం 10 నుంచి 20 కిలోమీటర్ల స్పీడులో కూడా వెళ్లలేని కాలనీ రోడ్డులో ఒక మనిషి పైనుంచి కారును పోనిచ్చి అతని చావుకు కారణం అవ్వడమే కాకుండా నిర్లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకొని పరారవ్వడం పట్ల కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు కాలేజీ ఎదుట తండ్రి మృతదేహాన్ని పెట్టుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర కార్యవర్గ, పీసీసీ సంవిధాన్ బచావో కమిటీ సభ్యులు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె బాలశౌరి మాట్లాడుతూ ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం డైరెక్టర్ చలపతిరావు వెంటనే ఇక్కడకు రావాలని డిమాండ్ చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఎలక్షన్ విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు.. కుటుంబ సభ్యుల మాత్రం తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని మొండిపట్టు పట్టారు. తండ్రి చావుకు కారణమైన ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ డైరెక్టర్ చలపతిరావును అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించినా గాని కోదాడకు పరారైన చలపతిరావు అందుబాటులోకి రాలేదు. ఏది ఏమైనా ఎలక్షన్ విధులకు ఆటంకం కలుగుతుందని పోలీసుల ఎలక్షన్ విధులకు సహకరించాలని ఎలక్షన్ అనంతరం గురువారం ఉదయం తప్పనిసరిగా ఉదయం 10 గంటలకల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తామని బాధితులకు దళిత సంఘాల నాయకులకు హామీ ఇవ్వడంతో అందరూ ధర్నా విరమించారు. బాల శౌరి మాట్లాడుతూ గురువారం డైరెక్టర్ చలపతిరావు సాల్మన్ రాజు కుటుంబానికి న్యాయం చేయాలని లేకుంటే ప్రియదర్శిని డిగ్రీ కాలేజీని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శోభ, ఆరిఫ్, నిస్సార్ ఇతర దళిత సంఘాల నేతలు మందా హనుమంతు,పూల రవీందర్, రామాంజనేయ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

కొసమెరుపు….
సోమవారం మధ్యాహ్నం దళితుడు సాల్మన్ రాజును కారుతో తొక్కించిన కారు ఓనర్ చలపతిరావుతో పాటు స్థానిక అధికార పార్టీ నాయకులు కారులోనే ఉన్నారని ముందు రోజు జరిగిన ఎలక్షన్ ఫలితాల అనంతరం ఫుల్లుగా పార్టీ చేసుకుని భోజనానికి బయటకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
పట్టపగలు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రోడ్డుపై వ్యక్తిని ఆక్సిడెంట్ చేసి పడిన మనిషిని సైతం చూడకుండా కారు ఎక్కి తొక్కించడం చూస్తుంటే మానవత్వం మంట కలిసి పోతుందని అర్థమవుతుంది. కుక్కకన్నా హీనంగా మనిషిని కారుతో తొక్కించిన ప్రియదర్శిని కళాశాల డైరెక్టర్ చలపతిరావు మరియు ఇతర అధికార పార్టీ నాయకుల పై ఏ మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే…