News & Views

చర్చ పాల్వంచ: ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి

ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ పాల్వంచ

ఈ రోజు పాల్వంచ పట్టణంలో తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కుంజ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదన్న మాట్లాడుతూ.. తరతరాలుగా అడవి జీవనాధారంగా మనుగడ సాగించిన ఆదివాసులకు భూమిపై హక్కులు కల్పించకపోవడం పాలకుల నిర్లక్ష్యమేనని, దేశంలో అనేక షెడ్యూల్ ఆదివాసి చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదన్నారు. గత పాలకులు పోడు భూముల సమస్యను పాక్షికంగా పరిష్కరించారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఫారెస్ట్ వారి పోడు భూముల ఆక్రమణల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగడం బాధాకరం అన్నారు. ఏజెన్సీలో ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల సాగులో ఉన్న పోడు భూముల్లో పంటలను ధ్వంసం చేస్తూ, ఆదివాసి గ్రామాల్లో రోడ్లు, కరెంటు, మంచినీరు, ఇతర మౌలిక సమస్యల విషయంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. పోడు భూముల సమస్య పట్ల పాలకుల ద్వంద్వ విధానాల వల్ల ఫారెస్ట్ అధికారులకు, పోడు సాగుదారులైన ఆదివాసీలకు మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో 25, 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న వలస “గోండు” తెగ ఆదివాసీలను ఆదివాసి తెగలలో ఎక్కడ లేని నిక్ నేమ్ “గొత్తి కోయలు” అన్న నెపం వేసి వారు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు వారిని “గొత్తి కోయలు” అని నిక్ నేమ్ తో సంబోధించడం ఆదివాసీలను అవమానించడమేనని అన్నారు. చతిస్గడ్ అయినా, తెలంగాణ అయినా వారు ఉంటున్నది భారత రాజ్యాంగంలో గుర్తించిన ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోనని, దేశవ్యాప్తంగా షెడ్యూల్, ఆదివాసి చట్టాల ప్రకారం వారికి ఒకే విధమైన గుర్తింపు ఉంటుందని, వారిని ఇక్కడ ఆదివాసీలుగా గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆదివాసుల సాగులో ఉన్న, గతంలో ఎఫ్ ఆర్ సి కమిటీల ఆధ్వర్యంలో సర్వే చేసిన పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, ఆదివాసి చట్టాలు అమలు చేయాలని, ఆదివాసీ గ్రామాలకు రోడ్లు కరెంటు మంచినీరు ఇతర మౌలిక సమస్యలు పరిష్కరించాలని, ఆదివాసి గ్రామాల సమగ్ర అభివృద్ధిని కోరుతూ.. తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 17న పాల్వంచలో జరుప తలపెట్టిన ర్యాలీ, సదస్సును ఆదివాసి పోడు సాగుదారులు, ప్రజలు ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుంజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, మడివి దేవయ్య, మడకం దేవయ్య, మడివి సోమయ్య, కొర్స వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు