చర్చ, పెద్దపల్లి: ప్రతి రైతుకు సమృద్ధిగా యూరియా పంపిణీకి పటిష్ట చర్యలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- భూ విస్తీర్ణం ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయాలి
- 10 రోజులలో రాష్ట్రవ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ అమలు
- యూరియా పంపిణీ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల.
సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన మేర సమృద్ధిగా యూరియా సకాలంలో పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు సోమవారం హైదరాబాద్ నుంచి యూరియా బుకింగ్ యాప్, యూరియా పంపిణీ పై ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా సరిగ్గా లేని కారణంగా గత సీజన్ లో యూరియా సరఫరా లో కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ రైతులకు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసామని మంత్రి తెలిపారు.
ప్రస్తుత యాసంగి సీజన్ కు ఎటువంటి యూరియా కొరత లేదని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదన అందించిన వెంటనే స్టాకు పంపడం జరుగుతుందని మంత్రి తెలిపారు. యూరియా పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్యాక్స్ కేంద్రాలలో, ప్రైవేటు డీలర్ల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, యూరియా కొనుగోలు కోసం వచ్చే రైతులకు నీడ ఉండేలా షామియానా, త్రాగు నీరు వసతి కల్పించాలని మంత్రి తెలిపారు.
యాప్ వినియోగం లేని జిల్లాలలో రైతుల పట్టా పాస్ పుస్తకాలను పరిశీలించి భూ విస్తీర్ణం ఆధారంగా యూరియా అమ్మకాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత సిబ్బందిని సెల్ పాయింట్స్ వద్ద అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్న యూరియా స్టాక్ వివరాలతో ప్రెస్ నోట్ విడుదల చేయాలని, ప్రతి సెంటర్ వద్ద అవసరమైన మేర యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.
భారీ సబ్సిడీ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే యూరియా రైతులకు మాత్రమే చేరాలని, ఇతర అవసరాల కోసం బదిలీ కావద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు యూరియా స్టాక్ వివరాలను కలెక్టర్లు పరిశీలించాలని, అవసరం ఉన్న చోట వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. రాబోయే పది రోజులలో రాష్ట్రవ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి తెలిపారు
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు మాట్లాడుతూ, సకాలంలో యూరియా పంపిణీ 70 లక్షల మంది రైతుల సంబంధించిన సున్నితమైన అంశమని, దీనిని జిల్లా కలెక్టర్ లు రెగ్యులర్ గా మానిటర్ చేయాలని సి.ఎస్ సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా స్టాక్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతిరోజు ఎంత యూరియా పంపిణీ జరుగుతుంది వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు
రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు మీడియా కు అందిస్తూ సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలని అన్నారు. గత సంవత్సరం కంటే 87 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు సరఫరా చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడ ఎటువంటి కొరత లేదని, మొత్తం 11 వేల 912 సెల్ పాయింట్ల ద్వారా యూరియా రైతులకు విక్రయిస్తున్నామని అన్నారు.
మహబూబ్ నగర్ , జనగాం, నల్గొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ 20 నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా డిఫరెన్స్ జరుగుతుందని, 82 వేల 59 మంది రైతులు 2 లక్షల 1 వేల 789 బ్యాగుల యూరియా యాప్ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, యూరియా బుకింగ్ యాప్ ద్వారా పెద్దపెల్లి జిల్లాలో 22 వేల మంది రైతులు దాదాపు 60 వేల యూరియా బ్యాగులను బుక్ చేశారని తెలిపారు. రైతులు ఎకరానికి కేటాయించే యూరియా బస్తాల సంఖ్య పెంచాలని కోరుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. యాప్ వినియోగం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, యూరియా బుకింగ్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.