చర్చ, సింగరేణి: సింగరేణిలో ఎస్ఎన్పిసి సెక్యూరిటీ నియామకాలపై ఆరోపణలు
- కాంట్రాక్టు పెంపు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు
- 2 లక్షల బేరానికి 12 మంది మెడికల్ కి సిద్ధం
- కళ్ళు మూసుకోని పాలు తాగే పద్ధతిని ప్రదర్శిస్తున్న సింగరేణి
- కాల్ రికార్డింగ్స్ తో ఆరోపణలకి మరింత బలం
సింగరేణి కాలరీస్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఎస్ఎన్పిసి (SNPC) సెక్యూరిటీ విభాగంలో నియామకాల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు కొత్తవి కాదని విమర్శకులు అంటుండగా, ఎస్ఎన్పిసి సంస్థలో జరుగుతున్న పరిణామాలు ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఎన్పిసి సెక్యూరిటీ కాంట్రాక్టు ఫిబ్రవరిలో ముగియనుండగా, మరో మూడు నెలల పాటు కాంట్రాక్టును పొడిగించిన నేపథ్యంలో, కొంతమంది సెక్యూరిటీ సూపర్వైజర్లు నియామకాల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్లు ఇంకా సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తూ, కొత్త రిక్రూట్మెంట్ను ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సెక్యూరిటీ నియామకాల్లో ఈవెంట్లు నిర్వహించి, నిబంధనల ప్రకారం ఎంపిక చేయాల్సి ఉండగా, ఒక్కో పోస్టును రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకుని అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక రానున్న రోజుల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి, జనవరిలో వి.టి.సి శిక్షణ పూర్తిచేసి, ఫిబ్రవరిలో విధుల్లోకి తీసుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం యూనియన్ నాయకుల అండదండలతోనే సాగుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సింగరేణి విజిలెన్స్ విభాగం తక్షణమే స్పందించి, ఎస్ఎన్పిసి సెక్యూరిటీ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికి తీయాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే నియామకాల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.