News & Views

చర్చ: భద్రాద్రి కొత్తగూడెం: మూగజీవాలతో ప్రజల పరేషాన్‌

రోడ్లపైనే ఆవులు, కోతులు, కుక్కలు

 

 

మూగజీవాలతో ప్రజల పరేషాన్‌
– రోడ్లపైనే ఆవులు, కోతులు, కుక్కలు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏ ప్రధాన రహదారి వెంబడి చూసినా, లేదా ఏ వీధిలో చూసినా పశువులు, మూగజీవాలతో ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు. ఏళ్లతరబడి ఈ సమస్యలతో ప్రజలు, వాహనదారులు ఆందోళనకు గురవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడే స్పందించే అధికారులు ఆ తరువాత మొఖం చాటేస్తున్నారు. వీటి వల్ల ప్రమాదాలు జరిగి ఎందరో గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం కన్పించడంలేదు. కొత్తగూడెం పట్టణంలోని రామవరం, బాబుక్యాంప్, బర్మాక్యాంప్, సీఆర్‌పీ క్యాంప్, ఎస్‌సీబీ నగర్, రైటర్‌ బస్తీ, ఫ్యూన్‌ బస్తీ, కూలీలైన్, హనుమాన్‌ బస్తీ, పెద్దబజార్, చిన్నబజార్, మేదర బస్తీ, మధుర బస్తీ, గొల్లగూడెం, గాజులరాజం బస్తీ, ఎ –పవర్‌ హౌజ్‌ బస్తీ, బి–పవర్‌ హౌజ్‌ బస్తీ, గంగబిషన్‌ బస్తీ ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద చెప్పలేనివిధంగా ఉంది. వీధికి పది కుక్కలు కలిసి ఒక గ్యాంగ్‌ను మెయింటెన్‌ చేస్తూ ఆ దారివెంట వచ్చిపోయే వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలే టార్గెట్‌గా వారిపై దాడులకు తెగబడుతున్నాయి. రోజురోజుకూ కుక్కల సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడంలేదని, ఫలితంగా రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

– ఇళ్లను గుళ్ల చేస్తున్న కోతులు
అన్ని కాలనీల్లోనూ కోతుల దండు ఇళ్లలోకి చొరబడి లూటీలు చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల గుంపును చూస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందంటున్నారు. బయట మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పాలు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేసి చేతిలో పట్టుకుని వస్తే చాలు కోతులు తెగబడుతున్నాయని, దీంతో గాయాలపాలవుతున్నామని అంటున్నారు. ఎన్నిసార్లు కోతులను తరిమేయాలంటూ ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్‌ అధికారులకు విన్నవించినా ఫలితం మాత్రం కన్పించడంలేదని అంటున్నారు.

– రహదారులపై ఆవులతో పొంచి ఉన్న ప్రమాదాలు
రామవరం నుంచి మొదలుకొని లక్ష్మీదేవిపల్లి వరకు జాతీయ రహదారిపై, పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ వరకు కొత్తగూడెం – ఖమ్మం ప్రధాన రహదారిపై ఎక్కడ పడితే అక్కడ పశువులు దర్శనమిస్తున్నాయి. రోడ్లపై అడ్డంగా పడుకుని ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు పశువులను ఢీకొని ప్రమాదాలభారిన పడి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. పశువులను యజమానులు తీసుకువెళ్లాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఎవరూ పశువులను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడంతో రహదారులపై ఇవి ప్రమాదసూచికలుగా నిలుస్తున్నాయి. ఈ అంశాలపై ఇప్పటికే అధికారులకు పలుమార్లు విన్నవించిన వివిధ పార్టీల వారు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నాం: లిక్కి బాలరాజు, సీపీఎం నాయకుడు
ప్రజలు కుక్కలు, కోతులు, పశువులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుక్కలు, కోతుల వల్ల ఇళ్లలోని వారు గాయాలపాలవుతుంటే, పశువుల వల్ల రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు ఈ సమస్యను ప్రధాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. అధికారులు స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధంగా ఉన్నాం

 

పశువులను రోడ్లపై నుంచి తొలగించాలి: జలాల్, ఆటో డ్రైవర్‌
రోడ్లపై పశువులు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఆటోలు నడపాలంటే భయపడాల్సి వస్తోంది. అధికారులకు అనేకసార్లు పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించాము. పశువుల యజమానులు చొరవ తీసుకుని పశువులను తమ ఇళ్ల వద్దనే ఉంచుకోవాలి.