చర్చ:-బ్యూరో కరీంనగర్: ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- వివిధ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ పరిశీలన
- మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, కొత్తపల్లి మండలం బద్దిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు.
ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి అనుమతించకూడదనీ కలెక్టర్ అక్కడి ఎన్నికల అధికారులను ఆదేశించారు.