News & Views

చర్చ, జగిత్యాల : అడవి జంతువుల పేరిట విద్యుత్ ఫెన్సింగ్ ప్రమాదం

ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం

చర్చ, జగిత్యాల: అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకంటూ వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం అన్నారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్లకు నేరుగా లేదా అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది అత్యంత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ ఫెన్సింగ్ మరింత ప్రమాదకరంగా మారి, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తెలియక తాకితే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు.
విద్యుత్ ఫెన్సింగ్ కారణంగా కేవలం మనుషులకే కాకుండా, ఆవులు, ఎద్దులు, మేకలు వంటి పశువులు కూడా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నాయని ఎస్‌ఈ తెలిపారు. ఇది వారి కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు.
అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రతే విద్యుత్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు మరియు ప్రజలు తమ వరి పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయరాదని, పంట రక్షణ కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఎస్‌ఈ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ విద్యుత్ ఫెన్సింగ్ ఉన్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్ ఈ కోరారు . విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు .