News & Views

చర్చ:రామ గిరి : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10 వేల పెన్షన్ కోసం పోరాటం

  • కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే లక్ష్యం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మండల కేంద్రమైన సెంటనరీ కాలనీలో సోమవారం సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ఒకప్పుడు కాకా వెంకటస్వామి పునఃరక్షించిన విధానమే తనకు స్ఫూర్తిగా మారిందని పేర్కొన్నారు.

రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, ప్రస్తుతం అందుతున్న అరకొర పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10,000లకు పెంచాలనే డిమాండ్‌ను పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. ఈ అంశంపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ, తప్పకుండా సాధించి తీరుతానని రిటైర్డ్ కార్మికులకు హామీ ఇచ్చారు.

అలాగే సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి ద్వారా కార్మికుల ప్రయాణాలు సులభతరం చేయాలనే లక్ష్యంతో చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు.

ఈ క్రమంలోనే స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గడచిన పార్లమెంటు సమావేశాల్లో రూ.100 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎంపీ వెల్లడించారు.

ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన రామగిరి ఖిల్లా అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు కావడం ఆనందకర విషయమని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.1.5 కోట్లను అటవీ శాఖకు ఖిల్లా అభివృద్ధి పనుల కోసం అందజేశామని వివరించారు. రానున్న రోజుల్లో రామగిరి ఖిల్లాను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రాంతానికి ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యమని అన్నారు.

కాకా వెంకటస్వామి, అలాగే ఎంపీగా వివేక్ సింగరేణి కార్మికుల ఆశీస్సులతో వారి సంక్షేమానికి చేసిన సేవలను స్మరిస్తూ, అదే బాటలో తాను కూడా మీ అందరి ఆశీస్సులతో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

రిటైర్డ్ కార్మికుల గౌరవం, భద్రత, సంక్షేమమే తన రాజకీయ జీవిత లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నూనె రాజేశం, నక్క శంకర్, చిలకల జవహర్, బోనాల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.