News & Views

చర్చ : రామగిరి: విద్యుత్ సరఫరాలో అంతరాయం

సింగరేణి కార్మిక క్షేత్రంలో కార్యాలయాల్లో అలుముకున్న చీకటి.

అర్జీ 3లోని సెంటినరీ కాలనీ కార్మిక క్షేత్రానికి విద్యుత్ సరఫరా చేసే 132 కేవీ విద్యుత్ లైన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గృహ అవసరాలు, కార్యాలయ పనులు పూర్తిగా స్థంభించాయి. ముఖ్యంగా తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడింది. విద్యుత్ అంతరాయం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని లోపం కారణాలను పరిశీలించారు. 132 కేవీ లైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని త్వరగా చక్కబెట్టేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు.
త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే తరచూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని, శాశ్వత పరిష్కారం చేపట్టాలని సెంటినరీ కాలనీ వాసులు కోరుతున్నారు.