కబ్జా స్థలాల్లో సింగరేణి ‘సిమెంట్’ వాడకం..! – చోద్యం చూస్తున్న ఎస్అండ్పీసీ..?
కబ్జా స్థలాల్లో సింగరేణి ‘సిమెంట్’ వాడకం..!
– చోద్యం చూస్తున్న ఎస్అండ్పీసీ..?
చర్చ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం:
కబ్జాచేసిన స్థలాల్లో దర్జాగా అక్రమంగా తీసుకొచ్చిన సింగరేణి సిమెంట్‌ను వాడుతున్నారు కొందరు ప్రబుద్దులు. వేలాది రూపాయల విలువైన సింగరేణి సమెంట్ పక్కదారి పడుతున్నా సింగరేణి సెక్యూరిటీ విభాగం మాత్రం చోద్యం చూస్తోంది. చివరి క్షణంలో తూతూ మంత్రంగా దాడులు చేసి మమ అన్పిస్తున్నారుతప్ప బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే… చుంచుపల్లి మండలం నందాతండాలో కోటేశ్వరరావు వెంచర్లో పలువురు కొన్న స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. భూమిపై పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశ్యంతో కొందమంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తాము పోగుచేసుకున్న సొమ్ముతో వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. అయితే కొన్న నాటి నుండి మళ్లీ తమ స్థలాలు ఎలా ఉన్నాయని చూసేందుకు కనీసం రాకపోవడంతో పలువురు అక్రమార్కులు ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఈ కోవలోకే కోటేశ్వరరావు వెంచర్‌లోని 384 నెంబర్ గల ప్లాటు వస్తుంది. సదరు ప్లాట్‌ను గౌరీష్ అనే వ్యక్తి కొనుగోలు చేయగా, మరో వ్యక్తి కబ్జా చేసినట్లు గౌరీష్ పేర్కొన్నారు. ఈ ప్లాట్‌తోపాటు మరో పక్కను ఉన్న ప్లాట్‌ను కూడా అదే వ్యక్తి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.
– కబ్జా స్థలంలో సింగరేణి ‘సిమెంట్’?
ప్లాట్‌ను కబ్జా చేసి ఆక్రమించుకున్న వ్యక్తి అందులో నిర్మాణాలు ప్రారంభించినట్లు స్థానికులు చెప్తున్నారు. దీనిలో భాగంగా 384 నెంబరు గల ప్లాట్‌లో పునాదులు తీసేందుకు గోతులు తీసి, ఆ గోతుల్లో రాత్రికి రాత్రి సిమెంట్, కంకర మిక్చర్ పోయించినట్లు సమాచారం. కాని అందుకు ఉపయోగించిన సిమెంట్ మాత్రం సింగరేణి సంస్థకు చెందిన సిమెంట్ బస్తాలుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సింగరేణి సెక్యూరిటీ విభాగమైన ఎస్అండ్పీసీతోపాటు ఇంటెలీజెన్స్, విభాగాల అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోతుల్లో పోసిన సిమెంట్ మిక్చర్‌లో వాడిన సిమెంట్ సింగరేణి సంస్థకు చెందినదేనా అనే విషయాన్ని ఆరాతీశారు. అదేవిధంగా మిగిలిన కొన్ని సిమెంటు బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 383 నెంబరు ప్లాట్‌లో అప్పటికే తీసిన గోతుల్లో సిమెంట్ మిక్చర్ పోయడంతో అది ఆరిపోయింది. దీనిలో కూడా సింగరేణి సంస్థకు చెందిన సిమెంట్‌నే వాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై సింగరేణి ఎస్అండ్పీసీ, విజిలెన్స్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.
– ఆ సిమెంట్ ఎక్కడిది..?
కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాల కోసం వినియోగించిన సిమెంట్ ఎక్కడిదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ఎస్అండ్పీసీ, విజిలెన్స్ అధికారులు వచ్చి అది సంస్థకు చెందిన సిమెంట్గా గుర్తించినట్లు తెలుస్తోంది. అసలు ఆ సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే సందిగ్దం నెలకొంది. సంస్థకు చెందిన సిమెంటు బస్తాలు వందల సంఖ్యలో బయటకు ఎలా వచ్చాయి, వాటిని ఎవరు తీసుకువచ్చారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్టు వర్క్‌లు చేసే వ్యక్తి ఈ సిమెంట్ బస్తాలను తస్కరించినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు. సంస్థకు సంబంధించి చేపట్టే పలు సివిల్ వర్క్‌లలో వాడుతున్న ఈ యొక్క సిమెంట్ బస్తాలను అక్రమంగా తరలించినట్లు సమాచారం. ఎంతో పకడ్బంధీగా సింగరేణి సంస్థ ఎస్అండ్పీసి విభాగంతోపాటు ఇంటెలీజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు కప్పి మరీ సిమెంటు బస్తాలు బయటకు వెళ్లడంపట్ల కార్మికులు ముక్కున వేలేసుకుంటున్నారు. గోడౌన్ తనిఖీలు, ఆడిట్ రిపోర్టుల సమయంలో సంబంధిత అధికారులు కాకి లెక్కలు నమోదు చేసుకుంటున్నారా.. లేక చేతులు తడుపుకుంటున్నారా అని కార్మికులు చర్చించుకుంటున్నారు. మరి ఈ సిమెంటు బస్తాల ‘మాయ’ వెనుక ఉన్న వారిని సంస్థ విచారించి చర్యలు తీసుకుంటుందా.. లేక ఎవరైనా అధికారుల ‘హస్తం’ ఉన్నట్లు తెలిస్తే వదిలేస్తుందా అని కార్మికవర్గం చర్చించుకుంటుంది.