చర్చ, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమం
- నూతన సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే సర్పంచులు సక్సెస్ అవుతారు. – చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
- పంచాయతీ ఎన్నికల్లో 65% మేర ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం లభించింది – వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపరచడం పట్ల సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. – మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు జరిపే బాధ్యత సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లపై ఉంది – మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి
- కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఎన్నిక కాబడిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు.


చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించబడిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్లు సత్తు మల్లేష్, నాగుల సత్యనారాయణ, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఓడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరీ సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, సంగీతం శ్రీనాథ్ ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ లకు అభినందనలు..ప్రభుత్వం,పార్టీ మీకు అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా మీకు బాధ్యతలు ఉంటాయి.. గ్రామానికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రజలు మిమ్మల్ని చూస్తారనితెలిపారు. ప్రభుత్వ పథకాలు రావడంలో ,ఇతర కష్టాల సమయంలో, రాబోయే ఎంపీటీసీ ,జడ్పీటీసీ సహకార సంఘాల,ఎన్నికల్లో శాసన సభ,పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఉండాలనీ కోరారు. ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన నిధులు వస్తాయని.. ముఖ్యమంత్రి, శాసన సభ్యుల నిధులు గ్రామాలకు ఇస్తామని అన్నారు. వేసవికాలంలో గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమీక్ష చేసుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ , స్ట్రీట్ లైట్స్,ప్లాంటేషన్, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్యకు ప్రాధాన్యత కల్పిస్తుందని, స్కూల్ లో విద్యార్థులు ,టీచర్లు వస్తున్నారా అని చూసుకోవాలని అన్నారు. మీ గ్రామాలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు రాకుండా చూసుకొని ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివేలా చూడాలి.. మంచి అనుభవమున్న టీచర్లు ,మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వందిఅని తెలిపారు. మన జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం కూలిపోతే ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తు, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని.. పేరు తీసేసి జీ రామ్ జీ అని పేరు పెడుతున్నారని మండిపడ్డారు. నెహ్రూ ,ఇందిరా గాంధీల పేర్లు, వారి చరిష్మా చెరిపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు వేసిన ప్రాజెక్టులు, కేంద్ర సంస్థలు ,గరిభి హటావో లాంటి పథకాలు ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాయని,
జాతిపిత మహతా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆయన ను చంపిన గాడ్సే ను ఆరాధిస్తున్నారనీ దుయ్యబట్టారు. రేపు ఉపాధి హామీ కార్యక్రమాల దగ్గర, గాంధీ చౌరస్తాల వద్ద, గాంధీల ఫొటోలు పెట్టుకొని రేపు ప్రతి గ్రామంలో నిరసన తెలపాలనీ పిలుపునిచ్చారు. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పని చేద్దామని, మీకు అండగా ఉంటాం.. మీ వెంట ఉంటామని, కాంగ్రెస్ కుటుంబం ఉంది.. మరింత శ్రమించండి అని భరోసా ఇచ్చారు. ఓడిపోయిన వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారికి కూడా పార్టీపరంగా అండగా ఉంటామని అన్నారు. గెలిచిన సర్పంచ్ లకు ముఖ్యమంత్రి , పీసీసీ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుంటదని, పల్లెలే దేశానికి పట్టు కొమ్మలను అని, గ్రామాల్లో స్వరాజ్యం వెలిసినప్పుడు దేశం బాగుపడుతుందని బలంగా నమ్మి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వారి హయాంలో స్తానిక సంస్థలను బలోపేతం చేస్తూ నాటి వారి ప్రభుత్వ హయాంలో 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ, రాజీవ్ గాంధీ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సర్పంచులను బలోపేతం చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన సర్పంచులను గౌరవించడంతోపాటు, వారి కర్తవ్యం వారికి తెలియజేయాలని ఎంతోమందికి రాని అవకాశం, అదృష్టం గ్రామ సర్పంచులుగా మీకు వచ్చింది, గ్రామ ప్రథమ పౌరునిగా పిలిచే సర్పంచ్ ఒక్కరే ఉంటారు, ఈ దేశంలో రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి ఏవిధంగా అధికారాలు ఉంటాయో, గ్రామ ప్రథమ పౌరునిగా సర్పంచులకు అంతే అధికారం ఉంటుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు నేరుగా నిధులు ఇచ్చే అధికారం లేదని, కానీ సర్పంచ్ కు నేరుగా నిధులు ఇవ్వడానికి చెక్ పవర్ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 నుండి 80 శాతం సర్పంచులు గెలిచారని, మన ప్రభుత్వం కొనసాగుతుంది, మన శాసనసభ్యులు మంత్రులు ఉన్నారని, గత ప్రభుత్వంలో చాలామంది సర్పంచులు ఏ విధంగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినారో ఆ చెడ్డ పేరు మనకు రాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉండి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే సర్పంచులుగా విజయవంతులు అవుతారని హితబోధ చేశారు. మరో ఐదు సంవత్సరాలు దాకా ఎన్నికలు లేవు, గ్రామాలలో పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగాయి, గెలిచిన ఒక్కరు మిగతా అందరిని కలుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా పనిచేయాలని, పటిష్టంగా పథకాలు అమలు జరిపే బాధ్యత సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొప్ప పనులను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, సర్పంచులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా పని చేయాలనీ సూచించారు. మన ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయని, ఏకకాలంలో ఏ దేశంలో చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేసామని, ప్రతి రైతుకు అదనంగా వెయ్యి రూపాయల రైతు భరోసా అందజేస్తామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఒక్క పేదవానికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదనీ, మన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళా సోదరీమణుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. 200 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అన్నారు. గత బిఆర్ఎస్ సర్కార్ పదిఏండ్ల పాలనలో ఏ గ్రామంలో ఉచితంగా ఒక్క గుడిసె కట్టించిన పాపాన పోలేదు, కానీ మన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3500 ఇందిరమ్మ ఇళ్ళను కట్టిస్తున్నమని, మరో మూడు సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందనీ అన్నారు. ఈ పథకాలను అమలు చేసే బాధ్యత నూతనంగా గెలిచిన సర్పంచ్ ల పై ఉందని, మీరు బ్రతికి ఉన్నంతవరకు పలానా సర్పంచ్ హయాంలో మా గ్రామంలో అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కరూ మీ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా మీ పరిపాలన ఉండాలనీ అన్నారు.
మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ల గెలుపు ప్రభుత్వ పనితనానికి నిదర్శనమని,
సర్పంచుల బాధ్యత అత్యంత కీలకమైనదనీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు వాటి నిర్వహన బాధ్యత సర్పంచులపై ఉంటుందనీ తెలిపారు. మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యం నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సర్పంచులను ఎన్నుకునే విధానంతో పాటు నిధులు సమకూర్చాలని ఆలోచనకు శ్రీకారం చుట్టారనీ, జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వం వైకుంఠదామాలను, సిసి రోడ్లను, హరితహారం, చెరువుల పూడికతీత ఇలాంటి ఎన్నో పనులను చేపట్టడం జరిగిందని, అంత గొప్ప పథకమైన జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తీసివేయాలని బిజెపి కుట్ర చేస్తుందని, ఇది బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తుందని అన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 65శాతం మేరకు ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి లభించిందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కేసీఆర్ పాలనలో గోదావరి నదీజలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, అసెంబ్లీ సమావేశాల వేళ కేసీఆర్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పిగొడుతూ ఆ పార్టీ నాయకుల నైజాన్నిబట్టబయలు చేయాలని ఆయన సర్పంచులను కోరారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను గ్రామాల్లో అమలు చేసే బాధ్యత ముమ్మాటికీ సర్పంచులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాల గురించి సర్పంచులకు వివరించాలన్నారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పడమే కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ఆ దిశగా సర్పంచులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు.