చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: అత్యవసర సమయాల్లో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించవచ్చు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
- బూర్గంపాడు లో భారీ మాక్ డ్రిల్ నిర్వహణ.

విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనకు మాక్ డ్రిల్ విజయవంతం
బూర్గంపాడు మండల కేంద్రంలో సోమవారం విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన కోసం విస్తృత స్థాయి మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యక్షంగా పాల్గొని, ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC) ద్వారా అన్ని శాఖల చర్యలను పర్యవేక్షించారు.
మాక్ డ్రిల్‌ను ఫైర్ శాఖ అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో, అబ్జర్వర్‌గా ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ సుఖేందర్ దత్ పర్యవేక్షణలో నిర్వహించబడింది. క్షేత్ర స్థాయిలో ఈ మాక్ డ్రిల్ బూర్గంపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతంలో జరిగింది. ఇందులో ప్రజలను సురక్షితంగా రక్షించడం, లైఫ్ జాకెట్లు, బోట్లు ఉపయోగించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, అవసరమైన వైద్య సేవలు, త్రాగునీరు, భోజనం, తాత్కాలిక నివాసం వంటి సేవలను డెమో రూపంలో ప్రదర్శించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో సేవలను బాధితులకు అందించడం, ఫైర్, ఇరిగేషన్, గజ యితగాళ్ల పాత్రను, వారు చేపట్టే అత్యవసర చర్యలను ప్రాక్టికల్‌గా ప్రదర్శించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో బాధితులకు త్రాగునీరు, భోజనం, అత్యవసర వైద్య సేవలు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను డెమో రూపంలో చూపించారు. అలాగే, బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిబ్బంది (EMC) మరియు రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొని, బాధితులకు అవసరమైన ఏర్పాట్లు మరియు సహాయ సేవలను సమన్వయంతో అందించారు.
బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అప్రమత్తత ద్వారా నష్టాలను నివారించవచ్చని, యువత, విద్యార్థులు, శాఖల అధికారులు సమన్వయంతో చురుగ్గా పాల్గొనాలి అని చెప్పారు.
ఎన్సిసి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, అత్యవసర పరిస్థితుల్లో వారు ఏ విధంగా స్పందించాలో, ఎలాంటి చర్యలు చేపడతారో తెలుసుకున్నారు. మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితులలో సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఇలాంటి మాక్ డ్రిల్లు కీలకమని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, విపత్తుల సమయంలో అన్ని బృందాలు సమన్వయంతో పనిచేయాలి, ఆధ్యాత్మిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి అని తెలిపారు. ప్రతి సంవత్సరం వరదలు సంభవించే బూర్గంపాడు లాంటి ప్రాంతాల్లో ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో, అధికారుల్లో విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, పోలీస్ శాఖ సిబ్బంది, ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారి,సీనయ్య, డిడిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్సిసి, ఫైర్, రెవెన్యూ, వైద్యశాఖ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.