చర్చ, సత్తుపల్లి: మంత్రి తుమ్మల కి టీ డబ్ల్యూజే ఎఫ్ ఆహ్వానం

- 20న ఖమ్మం జిల్లా 3వ మహాసభలకు కచ్చితంగా హాజరవుతానని హామీ
- ఆహ్వానపత్రికను అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్ బృందం
- రాష్ట్ర నాయకులు దయానంద్ కు సైతం ఆహ్వానపత్రిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో 20వ తేదీ శనివారం
నిర్వహించే యూనియన్ జిల్లా మహాసభలకు కచ్చితంగా హాజరవుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను సంఘం నేతలకు హామీనిచ్చారు. గండుగులపల్లి లోని మంత్రి నివాసం క్యాంపు కార్యాలయంలో యూనియన్ నేతలు మంత్రికి శుక్రవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆహ్వాన పత్రికలో భాగంగా పేర్కొన్న జర్నలిస్టుల డిమాండ్లను పరిశీలించారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో జర్నలిస్టుల కుటుంబాలకు పూర్తి స్థాయి ఉచిత వైద్యం అందించాలని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని… ఇలా పలు రకాల డిమాండ్లను టీడబ్ల్యూజేఎఫ్ ఆహ్వానపత్రికలో పొందుపరిచింది. వీటిపై మహాసభల సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ బృందం కోరింది. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రిని ఆహ్వానించిన యూనియన్ బృందంలో జిల్లా టీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు స్వతంత్ర టీవీ బ్యూరో ఇంచార్జ్ అయ్యప్ప, టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు, సిహెచ్. బాలకృష్ణ, స్వతంత్ర టీవీ సత్తుపల్లి రిపోర్టర్ సిహెచ్ గంగాధర్, చర్చ సత్తుపల్లి ఆర్సి ఇంచార్జ్ ఆనంద్, దిశ దినపత్రిక ఆర్సి ఇంచార్జ్ కొత్తపల్లి సుధాకర్ రావు, టీ డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ బాధ్యులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.