చర్చ, కరీంనగర్: ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

జగిత్యాల్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో *జాతీయ రైతు దినోత్సవం*ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, పొలాస అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎస్ హరీష్ కుమార్ శర్మ ఉత్తర తెలంగాణ మండలంలోని పరిశోధనా స్థానాలు, విస్తరణ విభాగం నుండి శాస్త్రవేత్తలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా రైతులు కొత్త సాంకేతిక విధానాన్ని అలవర్చుకొని వ్యవసాయాన్ని కొనసాగించాలనీ కోరారు. మార్కెట్లో డిమాండ్ మరియు ఎక్కువ ఎంఎస్పి ఉన్న పంటలను ఎంపిక చేసుకొని పండించాలని సూచించారు. మట్టి పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా ఎరువులు యాజమాన్యం పాటించాలని, తక్కువ యూరియాని అంటే సిఫార్సు చేయబడినటువంటి యూరియానే వాడాలని తెలియజేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి నాణ్యమైన విత్తనం ప్రతి గ్రామానికి అనే కార్యక్రమాన్ని, రైతు నేస్తం కార్యక్రమాన్ని, సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. మహిళలందరూ కూడా కస్టం హైరింగ్ సెంటర్స్ ద్వారా పరికరాలను వాడుతూ, రెంటుకు ఇస్తూ ఆదాయాన్ని పొందాలని సూచించారు. రైతు నిత్య విద్యార్థిగా కొత్తగా వస్తున్న టెక్నాలజీని నేర్చుకుంటూ, వ్యవసాయంలో ఉపయోగిస్తూ అధిక దిగుబడులను సాధించాలన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలందరూ వారు చేస్తున్నటువంటి పరిశోధనలను రైతులందరికీ తెలిసే విధంగా కరపత్రాలను అందించాలని, క్షేత్రస్థాయిలో ప్రదర్శన చేపట్టాలని, రైతులందరికీ ఉపయోగపడేలా పరిశోధనలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరిలో సమగ్ర యాజమాన్యం గురించి ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ యాసంగికి అనువైన వరి రకాలను, వాటి గుణగణాలను, చీడపీడలు- తెగుళ్లను తట్టుకునే రకాలను గురించి వివరించారు. కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ శనగలో వచ్చే చీడపీడలు మరియు, వాటి నివారణ చర్యలను వివరించారు. సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ రవి పంట అవశేషాలను వాటి యాజమాన్యం గురించి వివరించారు. తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త ఎన్ సుమలత యాసంగిలో వివిధ పంటల్లో వచ్చే తెగుళ్లు వాటి యాజమాన్యం గురించి వివరించారు. కీటక విభాగం శాస్త్రవేత్త వై.స్వాతి యాసంగిలో సాగు చేస్తున్న వివిధ పంటలలో సమగ్ర పురుగుల యాజమాన్యం గురించి వివరించగా, జగిత్యాల్ డిఎవో వి భాస్కర్ రైతులకు ప్రభుత్వం రూపొందించిన యూరియా పంపిణీ ఆప్ గురించి వివరించారు. ఈ సందర్భంగా యాంత్రికరణ కింద రోటరీ మల్చర్ వంటి పరికరాలకు కూడా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ అందించాలని ఎమ్మెల్యేని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో పూర్తి తెలంగాణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు 250 మంది వరకు పెద్ద ఎత్తున ఆసక్తిగా పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ మండలంలోని వివిధ పరిశోధన, విస్తరణ విభాగాల సాంకేతిక పరిశోధనల పరిజ్ఞానాన్ని, వివిధ పంటల వంగడాలను వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. తదనంతరం రైతులందరూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస ప్రాంగణంలోని పరిశోధన క్షేత్రాలను సందర్శించడం జరిగింది.