News & Views

చర్చ, కరీంనగర్: నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు

 

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – సీపీ గౌస్ ఆలం ఐపీఎస్
  • కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
  • డ్యామ్ కట్ట, తీగల వంతెనపై వేడుకలకు అనుమతి లేదు
  • డీజేలు, బాణాసంచాపై పూర్తి నిషేధం.. డ్రగ్స్ వాడితే జైలుకే
  • ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రధాన నిబంధనలు మరియు భద్రతా చర్యలు…

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: కమిషనరేట్ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో (మున్సిపల్ పరిధిలో 33 చోట్ల) డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి పాయింట్ వద్ద 8-10 మంది సిబ్బంది బ్రెత్ అనలైజర్లు, బాడీ వార్న్ కెమెరాలతో విధుల్లో ఉంటారని అన్నారు.

నిషేధిత ప్రాంతాలు: డిసెంబర్ 31 రాత్రి కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ఆనకట్ట, తీగల వంతెన పైకి వెళ్లడం, అక్కడ వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధించామని, ఆయా ప్రాంతాలలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.

డీజేలు & సౌండ్ పొల్యూషన్: నూతన సంవత్సరం వేడుకల్లో డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందని, ధ్వని కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు అందితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎవరైనా డీజే సౌండ్లతో అతిగా చేస్తే బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించవచ్చని తెలిపారు.

బాణాసంచా నిషేధం: బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం నిషిద్ధమని, చర్యలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

డ్రగ్స్ పై నిఘా: నగర శివార్లలోని గెస్ట్ హౌస్‌లు, ఫాంహౌస్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని, డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు నార్కో టీమ్స్, శిక్షణ పొందిన జాగిలాలు (Sniffer Dogs), డ్రగ్ డిటెక్ట్ కిట్లను ఉపయోగిస్తిన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై NDPS చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని అన్నారు.

మహిళా భద్రత: వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ మరియు పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సిపి విజ్ఞప్తి:
“నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకులకు ప్రాణ నష్టం కలిగించవద్దని అన్నారు. పోలీసులకు సహకరించి, ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి” అని సీపీ గౌస్ ఆలం కోరారు.