చర్చ, కరీంనగర్: గాంధీ చిత్రపటాలతో నిరసన
జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లెలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దుబ్బపల్లె గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన మహాత్మా గాంధీ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.