చర్చ : పహానీ ఖాళీ అంటే దోపిడీకి లైసెన్స్…
పహానీ ఖాళీ అంటే దోపిడీకి లైసెన్స్!
– లేని భూములకు పట్టాలు… ఉన్న భూములు గల్లంతు!
– ఆర్టిఏ చట్టం ద్వారా రికార్డులు అడిగితే రికార్డులు లేవు మీరే వచ్చి వెతుక్కోండి అని సమాధానం
– చెంచ–చంద్ర హయాంలో సుజాతనగర్ రెవెన్యూ కార్యాలయంలో అవినీతి మారణహోమం
– ప్రశ్నిస్తే కేసుల బెదిరింపులు… నోరు విప్పితే న్యాయం మాయం!
– భయంతో నలిగిపోతున్న పట్టాదారుల వారసులు
– సీబీఐ–ఏసీబీ విచారణకు డిమాండ్! కి బాధితుడి డిమాండ్…?
చర్చ, సుజాతనగర్:
సుజాతనగర్ రెవెన్యూ కార్యాలయం పది సంవత్సరాల క్రితం అవినీతికి అడ్డాగా మారిందా? అన్న అనుమానాలకు ఇప్పుడు ఆధారాలు బయటపడుతున్నాయి. అప్పటి వీఆర్వోలు చెంచయ్య, చంద్రయ్య హయాంలో పహానీ రికార్డులనే మలచి భూకబ్జాలకు బాట వేసిన అవినీతి మారణహోమం నేటికీ బాధిత కుటుంబాలను వెంటాడుతోంది.
ఖాళీ పహానీ కనిపిస్తే చాలు… అక్రమాలకు స్టార్ట్!
పహానీలో కాస్త ఖాళీ కనిపిస్తే చాలు—లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించడం, ఉన్న భూమిని లేనట్టుగా చూపించడం, ఆపై వేరే వాళ్ల పేర్లలో పట్టాలు ఎక్కించడం అప్పటి అధికారుల రోజువారీ పని అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డులనే ఆయుధంగా మార్చుకుని పరిటాల జారీ చేసి అసలు భూస్వాముల హక్కులను సమాధి చేసిన తీరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
వారసత్వ పట్టాలపై దాడి… కుటుంబ అనుమతి గాలికే!
పట్టాదారు మరణించిన తరువాత కూడా కుటుంబ సభ్యులు, చట్టబద్ధమైన వారసుల అనుమతి లేకుండానే వారసత్వ పట్టాలను మార్చడం అత్యంత ఘోరమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు
పూర్తి స్థాయి కుట్రేనని వారు చెబుతున్నారు.
మీకు సంబంధం లేదు”… ప్రశ్నిస్తే కేసులు!
ఈ అక్రమాలపై ప్రశ్నించేందుకు కార్యాలయానికి వెళ్లిన వారిని “మీకు సంబంధం లేదు… కేసులు పెడతాం” అంటూ బెదిరించారని బాధితులు చెబుతున్నారు. భయంతో ఎవరికీ చెప్పుకోలేక, న్యాయం కోసం కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి తిరిగి విసిగిపోతున్న పట్టాదారుల వారసుల పిల్లల ఆవేదన మాటల్లో చెప్పలేనిది.
రికార్డులే సాక్ష్యం… వెలికితీస్తే ముఠా బట్టబయలు!
అప్పటి ఎమ్మార్వో కార్యాలయంలోని పాత పహానీలు, పరిటాల ఫైళ్లు, వారసత్వ దరఖాస్తులను తాసిల్దార్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుని లోతైన పరిశీలన జరిపితే, ఈ అవినీతి వెనుక ఉన్న పెద్ద ముఠా పూర్తిగా బయటపడుతుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. స్థానిక విచారణతో ఇది వెలుగులోకి రాదని, అధికారులు అధికారులనే కాపాడుకునే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక సహించేది లేదు… సీబీఐ–ఏసీబీకి అప్పగించాలి!
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా ఏసీబీ చేత స్వతంత్ర విచారణ చేపట్టాలని సుజాతనగర్ ప్రజలు, బాధిత పట్టాదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నష్టపోయిన భూములను అసలైన వారసులకు తిరిగి అప్పగించాలంటూ వారు కోరుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే ఈ భూదోపిడీ వ్యవహారాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చి న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని బాధితులు హెచ్చరిస్తున్నారు.