చర్చ, కరీంనగర్: రెవెన్యూ, సాగునీటి అధికారులతో సమీక్ష – ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
- ప్రణాళిక ప్రకారం సాగునీటిని విడుదల చేయాలి
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
- నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా సాగు నీటి ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో పంటల సాగు కోసం ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సాగు నీటి ప్రాజెక్టుల నీటి మట్టాలు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎగువ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో ప్రస్తుత నీటి మట్టం వివరాలపై ఆరా తీశారు. మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరులో 1.8 టీఎంసీలు, అన్నపూర్ణ రిజర్వాయర్ లో 3.30 టీఎంసీలు, మిడ్ మానేరు ప్రాజెక్ట్ లో 26.65 టీఎంసీల నీరు నిలువ ఉందని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి నీటి పారుదల శాఖ అధికారులు తీసుకువెళ్ళారు.
జిల్లాలో రబీలో పంటల సాగుకు అనుగుణంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీటిని పక్కా ప్రణాళిక ప్రకారం విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, నీటి పారుదల శాఖ అధికారులు కిశోర్ కుమార్, జగన్, సంత్ ప్రకాశ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.