చర్చ : సింగరేణి ,సింగరేణి సిఎండిగా డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియామకం…
సింగరేణి సిఎండిగా డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియామకం
రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో కీలక మార్పులు చేపడుతూ.. 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా నియమిస్తూ ప్రభుత్వం బుధువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్మెంట్ (SCD) శాఖలో కార్యదర్శిగా సేవలందించిన డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేస్తూ, రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ రంగ సంస్థైన సింగరేణి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అదే ఉత్తర్వుల్లో, సింగరేణి CMDగా ఫుల్ అడిషనల్ చార్జ్ నిర్వహిస్తున్న డి. కృష్ణ భాస్కర్, ఐఏఎస్‌ను ఆ అదనపు బాధ్యతల నుంచి విడుదల చేశారు. డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ పరిపాలనా రంగంలో విస్తృత అనుభవం కలిగిన అధికారి. జిల్లా కలెక్టర్‌గా, ఎన్నికల విభాగంలో ఉన్నత బాధ్యతలు, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాల్లో కీలక పదవుల్లో పనిచేశారు. వైద్య విద్యాభ్యాసం కలిగిన అధికారి అయినప్పటికీ, పరిపాలనా సేవల్లో సమర్థుడిగా గుర్తింపు పొందారు. అయితే గత కొంత కాలంగా సింగరేణి సంస్థకు పూర్తి స్థాయి సిఎ డి లేకపోవడంతో పరిపాలన, బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం పడుతోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థకు పూర్తి స్థాయి CMDను నియమించడం ద్వారా, బొగ్గు ఉత్పత్తి, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్ణయాల్లో స్పష్టత, స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ నియామకం రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.