చర్చ , రామగిరి: జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ – జీఎం సుధాకర్‌రావు
చర్చ , రామగిరి, డిసెంబర్ 13:
ఈ నెల 19న జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏరియా–3 జనరల్ మేనేజర్ ఎన్. సుధాకర్‌రావు తెలిపారు. శనివారం జీఎం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏరియా–3 పరిధిలోని బొగ్గు గనులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ రామగుండం కోల్ మైన్స్ ఏరియాను తీర్చిదిద్దే క్రమంలో ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రామగిరి మండలం పన్నూర్, నాగేపల్లి, లద్నాపూర్, రత్నపూర్, బుధవారంపేట గ్రామాలతో పాటు కమాన్‌పూర్ మండలం ముల్కలపల్లి, జూలపల్లి గ్రామాలకు చెందిన ప్రభావిత ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిఎం సుధాకర్ రావు కోరారు.
ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం ఎం. రామ్మోహన్, పర్యావరణ అధికారి పి. రాజారెడ్డి, ఐఈడీ డీజీఎం బి.టి. మురళీకృష్ణ, క్వాలిటీ డీజీఎం బి.వి. సత్యనారాయణ, సివిల్ డీజీఎం రాజేంద్రకుమార్, పర్సనల్ విభాగాధిపతి బి. సుదర్శనం, ఎస్టేట్స్ అధికారి కె. ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.