చర్చ, కరీంనగర్: పతకాలే లక్ష్యంగా విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించేలా తెలంగాణ విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు వస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో 12వ రాష్ట్రcస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించేలా విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలు మెలకువలు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పిందన్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని రకాల క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ప్రాతినిధ్యం ఉండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలన్నారు. విద్యార్థులే కాకుండా పెద్దవారు కూడా వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో సాధన చేయాలని, వ్యాయామ అలవాట్లు కొనసాగించాలన్నారు. క్రీడల నిర్వహణకు ప్రభుత్వ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని మంత్రి తెలిపారు.
మానసిక ఉల్లాసానికి, శారీరక దేహ ధారుడ్యానికి క్రీడలు తోడ్పడుతాయని
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. క్రీడాకారుల్లో మానసిక పరిపక్వత, మనోనిబ్భరం మెండుగా ఉంటుందన్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్ నిర్వాహకులను ఆయన అభినందించారు.
శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. అనేక ఒత్తిళ్ల నుంచి క్రీడలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అందుకే ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడుతున్నదని కవ్వంపల్లి తెలిపారు. అందులో భాగంగానే క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన గుర్తు చేశారు.