చర్చ: రామగిరి: ప్రజాభిప్రాయ సేకరణ లో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించబడతాయి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
- ప్రజాభిప్రాయ సేకరణ లో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించబడతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
- శుక్రవారం రామగుండం బొగ్గు గని ప్రాజెక్టు పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రామగిరి మండలంలోని పన్నూరు, నాగేపల్లి, లడ్నాపూర్, రత్నాపూర్ , బుధవారం పేట రామాయపల్లి, కమాన్పూర్ మండలంలోని జూలపల్లి ములకలపల్లి వకీల్ పల్లి గ్రామాల సమీపంలో 4326 హెక్టార్ల విస్తీర్ణంలో 21 మిలియన్ టన్నుల ఓపెన్ కాస్ట్ బొగ్గు మైనింగ్ కొరకు రూపొందించిన డిపిఆర్ పై ప్రజాభిప్రాయ సేకరణ స్వీకరిస్తున్నామని అన్నారు.
రాబోయే 40 సంవత్సరాల పాటు బోగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు కలగకుండా, రామగుండంలో నూతనంగా ఏర్పాటు అయ్యే తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బోగ్గు సరఫరా చేసేందుకు ఉపయోగపడేలా ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ పనిచేస్తుందని అన్నారు.
ఓపెన్ కాస్ట్ మైనింగ్ పై ప్రజలు, వివిధ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అందించిన అభ్యంతరాలు సూచనలు సలహాలను నమోదు చేసి పర్యావరణ మంత్రిత్వ శాఖ న్యూ డిల్లీ కి నివేదిక అందించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. సురేష్ ,ఈఈ పొల్యూషన్ బోర్డు బిక్షపతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.