చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: ప్రకృతి పరిరక్షణపై అవగాహనతో పాటు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధే ప్రధాన లక్ష్యం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏరు ఉత్సవాలలో భాగంగా విజయవంతంగా ఫారెస్ట్ వాక్ కార్యక్రమం
ఏరు రివర్ ఫెస్టివల్ ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, జిల్లాలోని సహజ వనరులు, అటవీ సంపద ఆధారంగా పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఫారెస్ట్ వాక్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని ఫారెస్ట్ వాక్‌ను ప్రారంభించారు. అటవీ ప్రాంతాల గుండా సాగిన ఈ వాక్ యువతకు ప్రకృతితో నేరుగా మమేకమయ్యే అవకాశం కల్పించిందని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి అనువైన మంచి పిక్నిక్ స్పాట్‌గా, అలాగే పర్యటించడానికి అద్భుతమైన సహజ ప్రదేశమని తెలిపారు. అడవులు, కొండలు, సెలయేర్లు, సహజ వృక్ష సంపద కలగలిసి ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో జిల్లాకు ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదిగే అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఇలాంటి సహజ సుందర ప్రాంతాలను యువత పెద్ద సంఖ్యలో సందర్శించి, వాటి విశిష్టతను సమాజంలోని ఇతరులకు తెలియజేస్తూ పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.
ఫారెస్ట్ వాక్ సందర్భంగా పాల్గొన్న యువత అడవిలోని సహజ అందాలు, సెలయేర్లు, వెదురు గుంపులు, వివిధ రకాల పండ్లు, ఔషధ మొక్కలు, వృక్షజాలం, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో అడవుల పాత్ర ఎంత కీలకమో ఈ వాక్ ద్వారా అవగాహన కలిగిందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పాల్గొన్న యువత హస్తల వీరన్న స్వామి దర్శనం చేసుకొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని ముగించారు.
ప్రకృతి, ఆధ్యాత్మికత రెండూ కలిసిన ఈ కార్యక్రమం యువతకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించడమే లక్ష్యమని, ఇందుకు యువత భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్ సీసీ & ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.