News & Views

చర్చ, జగిత్యాల: గోదావరి పరివాహక ప్రాంతంలో పులి సంచారం..?

గోదావరి పరివాహక ప్రాంతంలో పులి సంచారం..?

  • నిర్ధారించాల్సిన అటవీ శాఖ అధికారులు!

చర్చ, జగిత్యాల: మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి మాయమైన ఓ పులి గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. కవ్వా ల్ అడవి నుంచి మాయమైన పెద్ద పులి అడుగులను అనుసరించి వెళ్లిన అటవీ శాఖ అధికారులకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులి అడుగులను గుర్తించినట్లు సమాచారం. జన్నారం పరిసర ప్రాంతాల వరకు పులి అడుగులు ఉన్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్న దారిపై నిర్ధారణ కు వచ్చినట్లు సమాచారం.

నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లా పరిధిలోని గోదావరి నది తీరంలో పులి సంచారం కొనసాగుతున్నట్టు గుర్తించి అటవీశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచారం. పులి గోదావరి నది తీరంలో, బీర్పూర్ ధర్మపురి, రాయికల్ మండల పరిధిలోని నది తీరం దాటి జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అటవీ శాఖ  యంత్రాంగం ముందస్తుగా జిల్లా పోలీసులను అప్రమత్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు ఆయా మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిసింది.  పులి సంచారం పై  పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారుల ఆఫీషియల్ ప్రకటన విడుదల కావాల్సి ఉందని తెలిసింది.