చర్చ , కొత్తగూడెం: విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ట్రాన్స్ఫార్మర్ పై బోల్తా పడిన ట్రాక్టర్

విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ట్రాన్స్ఫార్మర్ పై బోల్తా పడిన ట్రాక్టర్
పూర్తిగా దగ్ధమైన ట్రాన్స్ఫార్మర్
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
చర్చ , కొత్తగూడెం
ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది. అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్జన కాసుల ముందు ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణా పెను ప్రమాదానికి దారితీసింది. సారపాకలోని భాస్కర్ నగర్ నుంచి గాంధీనగర్‌కు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఓ ట్రాక్టర్ సోమవారం అదుపుతప్పి భారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ప్రజలు, పక్కనే ఉన్న కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రాక్టర్ బోల్తా పడిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ మంటల్లో చిక్కుకోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత వహిస్తారు?” అని వారు అధికారులను నిలదీస్తున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా చలనం శూన్యం! గత మూడు, నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో అక్రమ గ్రావెల్ తోలకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా, నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు అందినందువల్లే, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని పలువురు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ”అసలు బూర్గంపాడు మండలంలో అధికారులు ఉన్నట్టా లేనట్టా?” అంటూ స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే అడ్డు అదుపు లేకుండా, కనీస డ్రైవింగ్ నైపుణ్యం లేని వ్యక్తులతో (వచ్చి రాని డ్రైవింగ్) రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు వాపోతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ గ్రావెల్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని,బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు