News & Views

చర్చ, కరీంనగర్: వేములవాడను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి — అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, వేములవాడలో పర్యాటకాభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల నిధులు వెచ్చిస్తూ విస్తరణ పనులు ఊపందుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ దేవదాయ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం రోజున కూడా వేములవాడకు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. వేములవాడ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత ఆకర్షణగా ఉంటుందన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని నాంపల్లి గుట్టకు రోప్‌వే ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందన్నారు. ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశం కావడంతో అక్కడ ఒక ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ ఆకర్షణ కూడా ఏర్పాటు చేయవచ్చని సూచించారు. మిడ్ మానేరు డ్యామ్‌లో కూడా బోటింగ్‌కు విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల వద్ద నిరుపయోగంగా ఉన్న బోటును అక్కడికి తరలించి, అదనపు బోట్లు ఏర్పాటు చేస్తే వేములవాడకు వచ్చే భక్తులకు మరింత పర్యాటక అనుభవం లభిస్తుందన్నారు.

వేములవాడలో నిర్మించిన హరిత హోటల్ సరైన ప్రమాణాలతో లేకపోవడంతో భక్తులు ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నూతన ప్రమాణాలతో పునర్నిర్మాణం చేసి అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 90 శాతం పూర్తయిన హరిత హోటల్ మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడను కేంద్రంగా చేసుకొని పరిసర ప్రాంతాల్లోని నాగారం, మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు, సనుగులలో శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం, పోతారంలో లంక రామన్న ఆలయం, రుద్రంగి లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను ఒకే హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. అలా చేస్తే వేములవాడకు వచ్చిన భక్తుడు కనీసం ఒక రోజు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ఆలయాభివృద్ధితో పాటు పర్యాటక సౌకర్యాల కల్పన కూడా అత్యవసరమని స్పష్టం చేసిన ఆది శ్రీనివాస్, టూరిజం శాఖ వెంటనే నివేదికలు తెప్పించి నిధులు మంజూరు చేయాలని సభ ద్వారా కోరారు. సంబంధిత విషయాలపై మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆది శ్రీనివాస్ అడిగిన విషయాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.