News & Views

చర్చ: రామగిరి : రెండవసారి రత్నాపూర్ సర్పంచ్‌గా పదవి స్వీకరణ పల్లె ప్రతిమ పీవీ రావు

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సోమవారం నూతన సర్పంచ్‌గా ఎన్నికైన పల్లె ప్రతిమ పీవీరావు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్(ఏఎస్ఓ) ఎ.రమ్య ప్రమాణస్వీకారం చేయించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం పల్లె ప్రతిమ పీవీ రావు మాట్లాడుతూ, రత్నాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, విద్యుత్, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, పేదల సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో పారదర్శక పాలన అందించి, ప్రతి సమస్యకు సమగ్ర పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మహిళలు, రైతులు, యువత అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని అన్నారు. గ్రామ శుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అదే విధంగా ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ పల్లె ప్రతిమ పీవీ రావు నాయకత్వంలో రత్నాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాద్రపు ప్రవళిక-ప్రశాంత్, వార్డ్ సభ్యులు పబ్బ స్రవంతి-వెంకటేష్, కెక్కర్ల ఉష-అశోక్, జక్కుల పద్మ-చందన్ కుమార్, కలవేన రవి, కండె లక్ష్మి-గట్టయ్య, కండె సాహితి-పోచం, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, పున్నం మణితేజ, జుట్టు యశోద, బత్తుల రాజమణి-రమేష్, కార్యదర్శి గంగుల సంతోష్, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్, ప్రజాప్రతినిదులు, భారీగా గ్రామస్థులు పాల్గొన్నారు.