News & Views

చర్చ, సత్తుపల్లి: అవయవాల ఇన్ఫెక్షన్ తో యువతి మృతి! వరస మరణాలతో అంబేద్కర్ నగర్ కాలనీ విలవిల

మృతులపై ఆరా తీయని ప్రభుత్వ యంత్రాంగం

అవయవాల ఇన్ఫెక్షన్ తో యువతి మృతి!

వరస మరణాలతో అంబేద్కర్ నగర్ కాలనీ విలవిల
మృతులపై ఆరా తీయని ప్రభుత్వ యంత్రాంగం

చర్చ, సత్తుపల్లి:

మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నక్క మోషే (లేటు), నక్క సుజాత దంపతుల కుమార్తె నక్క బ్లెస్సి (18సం”) అవయవాల ఇన్ఫెక్షన్ తో శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తూ చలాకీగా ఉండే బ్లెస్సి వారం రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మలమూత్రాలు ఆగిపోవడంతో హుటాహుటిన బంధువుల సాయంతో పాలవంచలో వైద్యం నిర్వహించినట్లు తెలిపారు. బ్లేస్సి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం యువతి మృతి చెందింది.ఈ ఘటన తెలుసుకున్న పలువురు అంబేద్కర్ నగర్ కాలనీలో ఇలాంటి మరణాలు సర్వసాధారణమైపోయాయని, కాలుష్యంలో బ్రతుకుతున్నాం కాపాడమని 35 రోజుల పాటు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని వాపోయారు.

సింగరేణి శైలు బంకర్ వ్యర్ధాల భారి నుండి పునరావాసం కోరుకున్న మాకు పునరావాసం కల్పించకపోగా, కాలనీలో వరుస మరణాలకు కారణమైన వాయు, నీటి కాలుష్యాల తీవ్రతపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా పిన్న వయసుకు చెందిన యువతీ,యువకులు మృతి చెందడం పై కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కాలనీవాసులు త్రాగే నీరు, పీల్చే గాలి పై పరీక్షలు నిర్వహించి కాలుష్య తీవ్రతను అంచనా వేయాలని, కాలనీలో సంభవించే వరస మరణాలపై ఆరా తీయాలని ప్రభుత్వాన్ని కోరారు.