చర్చ : కరీంనగర్, అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో , నైతిక విజయం మా ప్యానల్ దే…
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో , నైతిక విజయం మా ప్యానల్ దే..
గెలుపు కోసం శాయ శక్తుల కృషి చేశాం..
కొన్ని ఓట్ల తేడాతో
మా అభ్యర్థులు ఓడిపోయారు..
కర్ర రాజశేఖర్ బీఆర్ఎస్
బిజెపితో ఆపవిత్ర పొత్తు..
అనైతిక చర్యలతోనే గెలుపు..
కర్ర రాజశేఖర్ వ్యవహారంపై
అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తాం..
మా ప్యానల్ నుంచి గట్టి పోటీ ఇచ్చాం..మా కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాం..పార్టీ గ్రాఫ్ పెరగడానికి ఎన్నికల్లో మా ప్యానల్ పోటీ..
ఇందులో విజయం సాధించాం..రాబోయే ఎన్నికల్లో రెట్టింపుపైనా ఉత్సాహంతో పని చేస్తాం..
స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం..
అర్బన్ బ్యాంకును అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి..
బ్యాంకు పై ఎలాంటి ఆరోపణలు రాకుండా కొత్త పాలకవర్గం జాగ్రత్తలు తీసుకోవాలి..
తమ ప్యానెల్ కు ఓటు వేసిన అర్బన్ బ్యాంక్ ఓటర్లు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..
అర్బన్ బ్యాంకు నూతన డైరెక్టర్లకు అభినందనలు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం మా ప్యానెల్ దేనని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కర్ర రాజశేఖర్ పానెల్ బీఆర్ఎస్ బిజెపితో ఆపవిత్ర పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కొద్ది ఓట్ల తేడాతోనే తమ ప్యానల్ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. అనైతిక చర్యలతోనే కర్ర రాజశేఖర్ ప్యానల్ గెలుపొందిందని పేర్కొన్నారు. కర్ర రాజశేఖర్ వ్యవహారంపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కొత్తపల్లి లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆదివారం వెలిచాల రాజేందర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా తమ ప్యానెల్ గెలుపునకు సహకరించిన అర్బన్ బ్యాంక్ మెంబర్లు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్యానెల్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. మా ప్యానల్ అభ్యర్థి లక్ష్మణరాజు తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. బ్యాంక్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపామని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ద్వారా పోటీ చేశామని పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు విప్ ఆది శ్రీనివాస్ ఆశీస్సులు తీసుకొని బరిలో దిగామని రాజేందర్ రావు తెలిపారు. ఎన్నికల్లో నీతిగా నిజాయితీగా స్వచ్ఛందంగా సేవలందించే అభ్యర్థులను పోటీలో పెట్టామని ఓటర్లను కలువడంలో కొంత వెనుకబడ్డామని అయినా మెజార్టీ ఓట్లను గణనీయంగా సాధించి గట్టి పోటీ ఇచ్చామని స్పష్టం చేశారు. అర్బన్ బ్యాంకు మెంబర్లకు సంబంధించి కేవైసీ లు కూడా చేయలేని స్థితిలో అర్బన్ బ్యాంకు వ్యవహారం ఉందన్నారు. అందరు మెంబర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు సైతం బ్యాంకులో అందుబాటులో లేవని ఇది బ్యాంకు పరిస్థితి అని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా మారిన అర్బన్ బ్యాంకు వ్యవస్థను ప్రక్షాళన చేసి ఖాతాదారులకు మెంబర్లకు పారదర్శకంగా సేవలందించేందుకు ఎన్నికల్లో నిర్మల భరోసా ప్యానల్ పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
అర్బన్ బ్యాంకు ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రెట్టింపు పైన ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ అభ్యర్థుల గెలుపునకు నూటికి నూరుశాతం పని చేస్తామని పేర్కొన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రెట్టింపు పైనా ఉత్సాహంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్రంగా క్లీన్ ప్యానల్ ఏర్పాటుచేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం చైతన్యం కలిగించామని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలకు గర్వకారణంగా గౌరవంగా నిలిచే స్వచ్ఛమైన నీతివంతమైన సేవలు అందించడంతోపాటు డిజిటల్ మరియు కస్టమర్ల ఫ్రెండ్లీ బ్యాంకు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్యానల్ తో బరిలో నిలిచామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ను కరీంనగర్ ప్రజల ముందు బహిర్గతం చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చేతులు కలపడం ప్రజలు గమనించారని ఈ విధమైన అసహజకుటములకు ప్రజలు ముగింపు పలకాలని కోరారు.. ఓటు హక్కు లేకపోయినా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలకు తమకు మద్దతుగా తరలివచ్చి పార్టీ పట్ల వారికున్న అంకిత భావాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
మా ప్యానల్ నుంచి ఇద్దరు ఘనవిజయం సాధించారని, మరో ఇద్దరు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. మహిళా అభ్యర్థికి 1150 ఓట్లు పడ్డాయని ఎస్సీ అభ్యర్థితో సహా మరికొందరు 600 నుంచి 700 వరకు ఓట్లు సాధించారని ఇది గెలిచిన అభ్యర్థుల ఓటు స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే చాలా మంచి ఫలితం అన్నారు.
ఈసారి మూడు బ్యాలెట్లు ఇవ్వడం వల్ల బ్యాంకు ఓటర్లలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. తక్కువగా సమయభం ఉండడం వల్ల ఈ విధానంపై తగిన అవగాహన కల్పించలేకపోయామని తెలిపారు. 850 ఓట్లు ఎస్సీ అభ్యర్థి బ్యాలెట్లో చేల్లని ఓట్లు పడ్డాయని, మా ప్యానల్ కు చెందిన వారికి 250 కంటే ఎక్కువ ఓట్లు చెల్లనివి పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రెట్టింపైన ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరారు.
కరీంనగర్ ప్రజలు ఇకపై బ్యాంకు వ్యవహారాల్లో అవినీతి అక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నూతన పాలకవర్గం ఇకపై ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చి తనకు ప్యానెల్ అభ్యర్థులకు సంఘీభావం తెలిపిన కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. వీరి మద్దతు తనను మరింత బలంగా ధైర్యంగా ముందుకు నడిపిస్తుందన్నారు. ఇక పార్టీ బలోపేతంతో పాటు రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తానని పేర్కొన్నారు. అందరూ గెలిచేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్యానెల్ నుంచి గెలిచిన డైరెక్టర్లు ఉయ్యాల ఆనందం, అనరాసు కుమారుకు శాలువాలు కప్పి వెలిచాల రాజేందర్రావు ఘనంగా సన్మానించారు.
ఈ విలేకరుల సమావేశంలో నూతన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ఉయ్యాల ఆనందం, అనరాసు కుమార్ కాంగ్రెస్ నాయకులు చిందం శ్రీనివాస్, తాండ్ర శంకర్, ఎం ఏ కరీం, కాసరపు కిరణ్, గండి గణేష్, అనంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.