News & Views

చర్చ : హైదరాబాద్, బ్యాక్‌డోర్‌లో బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ ఆపాలి…

చర్చ : హైదరాబాద్.

బ్యాక్‌డోర్‌లో బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ ఆపాలి
తక్షణమే ప్రభుత్వం విచారణ చేపట్టాలి
-బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

రాష్ట్రంలో బ్యాక్‌డోర్ మార్గంలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నిరుద్యోగ యువతనే నేడు అదే ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగ నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అక్రమ నియామకాలపై పలువురు నిరుద్యోగులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత ఎదురుచూస్తూ గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి వేల రూపాయలు ఖర్చు చేసి శిక్షణలు తీసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో “రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి” అనే నమ్మకంతో యువత పోరాడిందని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమపద్ధతిలో ఉద్యోగ నియామకాలు జరగలేదని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకే రోజున రెండు పరీక్షలు పెట్టడం వల్ల అనేక మంది అభ్యర్థులు అవకాశాలు కోల్పోయారని, ‘ప్రొవిజన్’ పేరిట పరీక్షలు లేకుండానే స్టేట్ లెవల్ పోస్టులు భర్తీ చేశారని ఆరోపించారు. లక్షన్నర జీతం ఉన్న ఉద్యోగాలు కొందరికి దక్కినట్లు సమాచారం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో 44 పోస్టులను రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితే న్యాయం జరుగుతుందని భావించిన యువతే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ నెలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందన్న స్పష్టత కూడా లేకుండా పోయిందన్నారు.ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టుల భర్తీ జరుగుతోందని, ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన బ్యాక్‌లాగ్ పోస్టులేనని తెలిపారు. గతంలో భర్తీ చేయని పోస్టులను ఇప్పుడు మళ్లీ దొడ్డిదారిన అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భయం యువతలో నెలకొందన్నారు.నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ సహా అనేక జిల్లాల నుంచి యువత తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తోందని చెప్పారు. గతంలో పోస్టుల అమ్మకాల ఘటనలు రుజువైనప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి విచారణలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్లు పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దని, అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.మెరిట్‌తో ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు తాము అండగా ఉంటామని, ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రామకృష్ణ, నిరుద్యోగ జాక్ చైర్మన్ నీలం వెంకటేష్, బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, బీసీ విద్యార్థి విభాగం కన్వీనర్ శివకుమార్, బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు జి. అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.