News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది

పాల్వంచలో దారుణ దాడి

 

 

పాల్వంచలో దారుణ దాడి
వేముల దుర్గారావుపై బత్తుల అంజి, అనుచరుల హత్యాయత్నం

చర్చ ,పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ములకలపల్లి గ్రామానికి చెందిన వేముల దుర్గారావు (35)పై బత్తుల అంజి, అతని అనుచరులు దాడి చేసి హత్య చేయడానికి యత్నించిన సంఘటన స్థానికంగా సంచలనానికి దారి తీసింది.
ఈ ఘటనపై బాధితుడు వేముల దుర్గారావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత ఏడాది నుంచి తన భార్య పుట్టింట్లోనే ఉంటూ తనపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో తాను, తన అన్నదమ్ములు జైలుకెళ్లారని తెలిపారు. అనంతరం పిల్లలను తానే చూసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని చెప్పారు.
ఇటీవల పిల్లలు, అక్క పిల్లలతో కలిసి కిన్నెరసాని దర్శనానికి వెళ్లి తిరిగి లక్ష్మీదేవిపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్తుండగా భార్య సోదరుడు బత్తుల అంజి అక్కడికి చేరి తన కారుపై దాడి చేశాడని తెలిపారు. తాను తప్పించుకునే ప్రయత్నంలో ములకలపల్లి వైపు వెళ్తుండగా అంజి, అతని అనుచరులు వెంబడించి పాల్వంచ పోలీస్‌స్టేషన్ దగ్గర కారును అడ్డగించి కర్రలతో దాడి చేసినట్లు వివరించారు.
దాడి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా బత్తుల అంజి అక్కడ హడావిడి సృష్టించి మళ్లీ దాడి చేసేందుకు యత్నించాడని చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు.
తనను ఆసుపత్రికి తరలించగా, పరామర్శించడానికి వచ్చిన తన బావ ఈర్ల గాంధీపై కూడా అంజి దాడి జరిపాడని తెలిపారు. గాంధీ తలపై తీవ్ర గాయాలు కావడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా 14 కుట్లు వేసినట్లు చెప్పారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఖమ్మం ద్వారా హైదరాబాద్‌కు తరలించారని వివరించారు.
దుర్గారావు మాట్లాడుతూ “బత్తుల అంజి తన రాజకీయ, ఆర్థిక ప్రభావం ఉపయోగించి మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. నా ప్రాణాలకు ముప్పు ఉంది. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి” అని వేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వేముల దుర్గారావు పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దాడిలో పాల్గొన్న బత్తుల అంజి, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితుని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారని సమాచారం. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధితునికి న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు