చర్చ హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా మద్యం షాపుల సిండికేట్ దందా_
_ఎంఆర్పీ ఉల్లంఘన, బెల్ట్ షాపుల నిర్వహణ - ప్రజల జేబులకు చిల్లు_

చర్చ కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం షాపుల సిండికేట్ దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు గుంపులుగా ఏర్పడి లైసెన్సులు దక్కించుకొని సిండికేట్గా మారి జిల్లాలోని మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.
కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో సిండికేట్ వ్యాపారులు ఎంఆర్పీ కంటే రూ.10 నుండి రూ.50 వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల తర్వాత విక్రయాలు నిషేధం. అయినా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు షాపుల్లో అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల సంఖ్య విపరీతంగా పెరిగింది. లైసెన్స్ షాపుల పరిధిలోనే 5 నుండి 10 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ సిండికేట్ దందా నడుపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం సులభంగా లభిస్తోంది.
ఎంఆర్పీ ఉల్లంఘన, సమయ పాలన పాటించకపోవడం, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నా తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్ కారణంగా స్వతంత్రంగా షాపు నడపాలనుకునే చిన్న వ్యాపారులు పోటీలో నిలవలేకపోతున్నారు.
సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్సులు రద్దు సహా కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.