చర్చ,వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు

చర్చ,వేములవాడ:
దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు రాజన్న దర్శనార్థం తరలివచ్చారు.
రాజన్న ఆలయం అభివృద్ధి పనులలో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయ పరిసరాల్లోని కళాభవన్, కళ్యాణ కట్ట, నివేదన భవనం, లడ్డు తయారీ కేంద్రం, పాత ఆంధ్రా బ్యాంక్ కార్యాలయం, ఈవో కార్యాలయం, ఓపెన్ స్లాబ్ వంటి నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. దీంతో భక్తులకు అవసరమైన తాత్కాలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారి తీసింది.ప్రస్తుతం కోడె మొక్కులు, స్వామి వారి కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లడ్డు ప్రసాదాల విక్రయాలు భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ స్థలం తక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాల కొరత కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నాయి బ్రాహ్మణులు వాహన పూజల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో స్థలం లేకపోవడంతో, జగిత్యాల బస్టాండ్ ప్రధాన రోడ్డుపై — చెత్తకుప్పల సమీపంలోనే భక్తుల తలనీలాలు తీసిన ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు రాజన్న భక్తులను తీవ్రంగా కలిచివేశాయి.కొంతమంది నాయి బ్రాహ్మణులు కేవలం డబ్బుల ఆశతో పది నుండి పదిహేనేళ్ల వయస్సు గల పిల్లలకే నడిరోడ్డుపైన తలనీలాలు తీయడం, అక్కడ ఉన్న భక్తుల్లో ఆవేదన రేపింది. ఈ అసంబద్ధ పరిస్థితిని గమనించినా ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఇక కట్ట కింద జగిత్యాల బస్టాండ్ వద్ద తలనీలాలు సమర్పించిన భక్తులు ఆలయానికి సంబంధించిన అధికారిక టిక్కెట్లు పొందకుండానే నాయి బ్రాహ్మణులకు నగదు చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆలయానికి రావలసిన ఆదాయానికి గండిపడినట్టు భక్తులు పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో మేడారం సమ్మక్క–సారక్క జాతర దృష్ట్యా, మేడారం వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకునే ఆచారం ఉన్నందున భక్తుల రద్దీ మరింతగా పెరగనుంది.తక్షణమే తాత్కాలిక కళ్యాణకట్టలు, తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆలయ ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు