News & Views

చర్చ : చుంచుపల్లి , కొత్తగూడెం , చుంచుపల్లి మండలంలో రోడ్లు, తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పోరు: ఎంపీడీఓకు వినతిపత్రం…

చర్చ : చుంచుపల్లి.

చుంచుపల్లిలో రోడ్లు, తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ పోరు: ఎంపీడీఓకు వినతిపత్రం
గుంతల రోడ్లు, పారిశుద్ధ్యంపై డిజిటల్ క్యాంపెయిన్ చేసినా స్పందన కరువు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు (19-11-2025) ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి, వినతిపత్రం సమర్పించారు.

జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కంతారావు గారి పిలుపు మేరకు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గూడెల్లి యాకయ్య మరియు ముత్యాల రాజేష్  ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రభుత్వంలో కదలిక కరువు
మండలంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణానికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయని, గతంలో ఈ సమస్యలపై పలుమార్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక రాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రోడ్ల మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా, మండలంలోని గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులు నత్తనడకన నడుస్తున్నాయని, దీంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా కూడా మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వారు ఎంపీడీఓ కార్యాలయ అధికారిణి సిహెచ్ సుభాషిని గారికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతి గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రంగరాజు రాజేష్ గారు, సాగర్, రమేష్, శ్రీకాంత్ నాయక్, రవి, మనోహర్, దీపక్, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, ఎండి యూసుఫ్, కలకోట ఐలయ్య, బోనగిరి శ్రీకాంత్, తాతారావు, ధరావత్ నాగమణి, బావుసతీష్, మునావర్, అజర్, రవితేజ, గూడెల్లి ముఖేష్, సుమంత్, చుంచుపల్లి మైనారిటీ నాయకులు హైమద్ రామంచి శీను, శివ, మాచర్ల ప్రదీప్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.