News & Views

చర్చ : సత్తుపల్లి ,వేంసూరులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా…

వేంసూరులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా…

—–నన్నాపేదెవరు అంటున్నా పట్టించుకోని మైనింగ్ అధికారులు—

ఖమ్మం జిల్లా, వేంసూరు మండలంలోని ఎర్రగుంటపాడు గ్రామం అక్రమ మట్టిదందాతో అల్లకల్లోలమవుతోంది.తమ సొంత స్థలంలో లేదా వ్యవసాయ భూమి లో మట్టి త్రవ్వుకోవడానికి సదరు యజమానులు ప్రభుత్వ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటిది ఎవరి మామూళ్లు వాళ్ళకి ఇచ్చాం
మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు?” అన్నట్టు మట్టి మాఫియా రెచ్చిపోతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా,రాజకీయ పరిరక్షణతో రోజూ రాత్రింబగళ్లూ మట్టి టిప్పర్లు గ్రామ రహదారులపై అడ్డూఅదుపు లేకుండా తిరుగుతున్నాయి.గ్రామ పరిసరాల్లో గుట్టలు కరిగిపోయేంతగా మట్టి తవ్వకాలు సాగుతున్నా… సహజ వనరులు ధ్వంసం ఔతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు సహా సంబంధిత శాఖలు మాత్రం కనిపించకుండా పోయాయి. అధికారుల నిర్లక్ష్యం మట్టి మాఫియాకు మరింత బలం చేకూర్చింది. ఈ అక్రమాల ద్వారా కొందరు వ్యక్తులు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిరంతరం తిరుగుతున్న అక్రమ మట్టి టిప్పర్ల వలన గ్రామ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటపొలాలకు వెళ్లే రైతులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వాహనాలు, ఆటోలు సైతం వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు.మట్టి టిప్పర్లు దూసుకుపోతుంటే… ప్రజల సమస్యలు ఎవరి దృష్టికి రావు అని గ్రామస్తుల వేదన.ఎర్రగుంటపాడు గ్రామ ప్రజలు తక్షణమే అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి స్పందించి అక్రమ మట్టిదందాను అరికట్టాలని, గ్రామ రహదారులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.