చర్చ : కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి – టీబీజీకేఎస్ సారయ్య,
కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
చర్చ : కార్మికుల హక్కులను కాలరాసేందుకు, భారత పారిశ్రామిక రంగాన్ని దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతనంగా 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని కార్మికసంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని శేషగిరిభవన్ లో కార్మిక నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కొత్త చట్టాలను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోడ్ లను అనుమతించమని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష యూనియన్ ల ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని గనుల డిపార్టుమెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ఈ నెల 26 ఉదయం జిల్లా కలెక్టర్లకు మెమోరండాలు ఇవ్వడం, అదే రోజు సాయంత్రం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా చేసే కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు అన్ని సంఘాల కార్యకర్తలు, నాయకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎఐటీయుసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్యనాయకులు సారయ్య, మంద నరసింహ రావు, పీతాంబరం, కాపు కృష్ణ, క్రిస్టోఫర్, వంగా వెంకట్, రమణ మూర్తి, వెంకటేశ్వర్లు, హుమాయూన్, ఆల్బర్ట్, తుమ్మ శ్రీను, ఐలయ్య, లక్ష్మి నారాయణ, వీరస్వామి, కృష్ణయ్య, సందేబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.