చర్చ,గోదావరిఖని:నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ సింగరేణి లో కార్మిక సంఘాల నిరసన..
నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ సింగరేణి లో కార్మిక సంఘాల నిరసన..
చర్చ,గోదావరిఖని: కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి, కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర్ర చేసింది. సింగరేణి రామగుండం రీజియన్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బొగ్గు గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తుందని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు కేంద్ర సర్కారు తీరుపై మండి పడ్డారు. దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా, సంపదను ఆదాని, అంబానీ లకు అప్పచెబుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించి యాంత్రికరణ, ప్రైవేటీకరణతో ఉత్పత్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంస్థలో కొత్త ఉద్యోగం నియామకాలు చేపట్టకుండా, ఉన్న కార్మికులను ఇంటికి పంపించే విధంగా కార్మికులపై మానసిక, శారీరక భారం మోపుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ కార్మికుల, కర్షకుల హక్కులను ప్రధాని మోడీ తాకట్టు పెడుతున్నారని నాయకులు విమర్శించారు. హక్కుల సాధన కోసం కార్మికలోకాన్నీ ఏకం చేసి పోరు బాట పడతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి, కార్మిక హక్కులను కాపాడాలని… లేనిపక్షంలో కార్మికులు తనిగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు మాదాసి రామ్మూర్తి, మిర్యాల.రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్,మెండె శ్రీనివాస్,ఆరెపల్లి హరీష్,రంగు శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు..