చర్చ, కొత్తగూడెం : అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా..?
అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా..?
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
- కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్న అధికారులు..!
- చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన ఎంపీవో, సెక్రటరీ
చర్చ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం:
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా అధికారులు తిరిగి కబ్జాదారుడికే వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… చుంచుపల్లి మండలం నంద తండా గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె దవాఖాన వెనుక వీధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుడు ఆక్రమించి పశువుల పెంపకం చేపట్టాడు. పశువులను ఆ స్థలంలో కట్టివేసి, వాటి వ్యార్థాలను రోడ్డుపై పడవేస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన విషయమై అప్పటి పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు ఫిర్యాదు చేయగా, ఫీల్డ్ విజిట్ చేసి చర్యలు తీసుకుంటామని రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీశారు. అయితే అధికారులు మారుతున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడంలేదని విమర్శిస్తున్నారు. స్థానికులు ప్రజావాణిలో ఎంపీడీవోకి, ఎంపీఓలకు సైతం ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో కబ్జాదారుడు మరింత రెచ్చిపోయాడు. పూర్తిగా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారుడు పునాదులు తవి గోడ నిర్మించతలపెట్టాడు. స్థానికులు వచ్చి అడ్డుకున్నప్పటికీ తనను ఎవరూ ఏమీ చేయలేరని దబాయిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీకి తిరిగి స్థానికులు ఫిర్యాదు చేయగా, తాను సెలవులో ఉన్నానంటూ బిల్ కలెక్టర్‌ను ఫీల్డ్ విజిట్‌కు పంపించినారు. బిల్ కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేసి సదరు కబ్జాదారుడిని పనులు నిలిపివేయాలని, పంచాయతీ స్రక్రటరీ విధుల్లో చేరిన తరువాత కబ్జా విషయమై చర్యలు తీసుకుంటారని చెప్పినప్పటికీ అతని మాటను ఖాతరు చేయకుండా పనులు కొనసాగించినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోకపోవడాన్ని బట్టి కబ్జాదారుడితో వారు సైతం కుమ్మక్కయ్యారేమోనని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే తంతు కొనసాగుతుండగా, అధికారులు రేపు వస్తాం, మాపు వస్తాం అని చెప్పడం తప్ప చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని, ఉన్నతాధికారులైనా దీనిపై దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుడి చెర నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీఓని ‘చర్చ’ ప్రతినిధి వివరణ కోరగా త్వరలోనే ఫీల్డ్ విజిట్ చేస్తామని, పరిధి దాటి ఆక్రమించి గోడల నిర్మాణం చేస్తే కూల్చివేస్తామని చెప్పారు. అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆక్రమణదారుడు చేపట్టిన నిర్మాణం సరైనదగా కాదా అని తెలుసుకునేంతవరకు నిర్మాణాలను నిలిపివేయాలని నోటీసు జారీ చేయాల్సి ఉండగా, అలా కాకుండా ఫీల్డ్ విజిట్ చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కబ్జాదారుడికి అధికారులు సహకరించడమే అని చర్చించుకుంటున్నారు