చర్చ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి – సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల మహా ధర్నా –

చర్చ, హైదరాబాద్ – సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల మహా ధర్నా
* సమస్యలపై ప్రభుత్వ మౌనం విచారకరం
* హక్కుల సాధన వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహంతో తెలంగాణ జర్నలిస్టులు బుధవారం సమాచార భవన్ ఎదురుగా చేపట్టిన మహా ధర్నా ఉద్రిక్తంగా కొనసాగింది. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మీడియా వర్గాలు ఏకతాటిపై నిలిచి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ ధర్నాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి నేతృత్వంలో భారీగా తరలి వచ్చిన స్థానిక జర్నలిస్టులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రత, ఆరోగ్య బీమా, గృహ నిర్మాణ పథకాలు, అక్రెడిటేషన్ సులభీకరణ, గ్రామీణ రిపోర్టర్లకు సౌకర్యాల కల్పన, ప్రెస్ క్లబ్బుల అభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.“ప్రజాస్వామ్య నాల్గవ స్థంభాన్ని ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తున్నది” – నాయకుల ఆగ్రహం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… “ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా నిలిచే మీడియాను ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోకపోవడం తీవ్రమైన అన్యాయం అన్నారు. మా సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం వెంటనే కదలిక చూపాలని తెలిపారు. మా హక్కుల కోసం ఈ పోరాటం ఆగదు, మరింత ఉద్ధృతం అవుతుంది” అని హితవు పలికారు.
నినాదాలు, ప్లకార్డులతో ఉద్రిక్త వాతావరణం
ధర్నా స్థలమంతా నినాదాలు, బ్యానర్లు, ప్లకార్డులతో కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాల నుండి వచ్చిన రిపోర్టర్లు తమ స్థానిక సమస్యలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలు ఏళ్ల తరబడి వాయిదా పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల కాలం నుంచి కొనసాగుతున్న వాగ్దానాలు కూడా అమలు కాలేదని, ప్రెస్ క్లబ్బుల అభివృద్ధి, గృహ నిర్మాణాలు, పింఛన్లు వంటి అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మీడియా మహా ధర్నా…
జర్నలిస్టుల ఐక్యతను ప్రతిబింబించే ఈ భారీ నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేసే జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ఇకపైనా విస్మరించకూడదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జర్నలిస్టుల డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం కొనసాగుతుందని టీయూడబ్ల్యూజే నాయకత్వం స్పష్టం చేసింది.
మహా ధర్నా విజయవంతం కావడంతో ప్రభుత్వం స్పందించేనా? రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, నిరంతర పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఆసక్తికర అంశంగా మారింది.