చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ విజయ నర్సింగ్ హోమ్‌లో శిశువు మృతి… ఆసుపత్రి నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు
పాల్వంచ విజయ నర్సింగ్ హోమ్‌లో శిశువు మృతి…
- ఆసుపత్రి నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు…
పాల్వంచ లోని విజయ నర్సింగ్ హోమ్‌లో శిశువు మృతి చెందిన ఘటన పై భాదితులు స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు
ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆసుపత్రి వైద్యురాలు మరియు సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ న్యాయం కోరుతోంది. బాధితురాలు గిరిజన మహిళ కావడంతో ఈ ఘటన స్థానికంగా మరింత చర్చనీయాంశమైంది.
విచారణ అధికారిని చూసి వైద్యురాలి వెళ్లిపోవడం అనుమానాస్పదం
మీడియా కథనాల నేపథ్యంలో పాల్వంచ డిప్యూటీ డీఎం & ఎచ్‌ఓ డా. జయలక్ష్మి ఆసుపత్రికి విచారణకు వెళ్లగా, ఆమెను చూసిన వెంటనే ప్రధాన వైద్యురాలు ఆసుపత్రి ప్రాంగణాన్ని విడిచిపెట్టడం సందేహాలకు తావిచ్చింది. అదే సమయంలో, ముఖ్యమైన పేషెంట్ కేస్‌షీట్ ఆసుపత్రిలో లభించకపోవడం విచారణను మరింత సంక్లిష్టం చేసింది.
అధికారులు కోరిన రికార్డులు, వివరాలను కూడా యాజమాన్యం అందించకపోవడం, సిబ్బంది తటపటాయించినట్టు వ్యవహరించడం విచారణకు ఆటంకం కలిగించింది.
- బాధితురాలిపై ఒత్తిడి…
- సీక్రెట్ వీడియోతో తప్పును కప్పిపుచ్చే ప్రయత్నమా?
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రి సిబ్బంది ఒక లాయర్ తరహాలో బాధితురాలికి,
“జరిగిపోయింది జరిగిపోయింది… బిడ్డ తిరిగిరాదు… మీ వాళ్లు అనవసరంగా గొడవ చేస్తున్నారు” అని కౌన్సెలింగ్ చేసినట్టు ఆరోపించారు.
ఈ సంభాషణను రహస్యంగా వీడియో రికార్డ్ చేసి, దానిని “మా తప్పు లేదు” అని చూపించుకోవడానికి ఆసుపత్రి ఉపయోగిస్తున్నట్లు కుటుంబం ఆరోపిస్తోంది.
రికార్డుల్లో తారుమార్లు… వైద్య విధానాల్లో తీవ్రమైన లోపాలు
విచారణలో వెలుగులోకి వస్తున్న ప్రధాన అంశాలు:
- ఆపరేషన్‌కు ముందు అవసరమైన పాతోగ్రామ్ వంటి కీలక పరీక్షలు చేయకపోవడం
- ఘటన సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం..
- ఆసుపత్రి రికార్డుల్లో మార్పులు జరిగినట్లు అనుమానాలు..
- విచారణ అధికారిని అడిగిన ప్రశ్నలకు సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం
ఈ పరిస్థితులన్నీ కలిపి చూస్తే, ఆసుపత్రి నిర్లక్ష్యం, రికార్డు లోపాలు, అలాగే తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అధికారుల పూర్తి నివేదిక కోసం ప్రజల ఎదురు చూపు
విచారణ అనంతరం “పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాం” అని తెలిపిన అధికారులు, ఇప్పటి వరకు సంఘటనపై తుది నివేదిక విడుదల చేయకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రి డాక్టర్ భర్త ప్రెస్ మీట్ పెట్టడం ఘటనపై గందరగోళాన్ని మరింత పెంచింది.
బాధిత కుటుంబం, స్థానిక నేతలు, గిరిజన సంఘాలు ఆసుపత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ను కోరుతున్నారు.