చర్చ, కలెక్టరెట్: సమన్వయంతో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
సమన్వయంతో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
చర్చ, కలెక్టరెట్:
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నిర్వహించనున్న తొలి విడత ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది తమ విధులకు సంబంధిత కేంద్రాల్లో రేపు ఉదయం తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సమయానుసారంగా తరలించాలని అన్నారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి తగినన్ని ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.
- పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుండటంతో, ప్రజల్లో అవగాహన కల్పించేలా పంచాయతీ వాహనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, వీడియో కెమెరాలు బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహనతో పనిచేయాలని, వారు కలిగే సందేహాల నివృత్తికి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.
- పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు అవసరమైన రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్దేశించిన రూట్లలోనే తరలించాలన్నారు. పోలింగ్ రోజు నివేదికలు సమర్పించేందుకు ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించి, వారికి తగిన శిక్షణ ఇచ్చి సమయానికి అన్ని నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, సంబరాలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన భోజనం, రవాణా వంటి సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పెద్ద పంచాయతీలు అయిన భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.