News & Views

చర్చ , కలక్టరేట్: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  • ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లాలో రేపు నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లాలోని ఏడు మండలాల్లో 155 గ్రామపంచాయతీలకు సర్పంచ్, 1,392 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల ప్రక్రియలో భాగంగా 16 గ్రామాల్లో సర్పంచ్ పదవులు, 386 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో మిగిలిన 138 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1006 వార్డులకు రేపు ఆదివారం ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించనుండగా, అదే రోజున ఫలితాలు ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

రెండవ విడత ఎన్నికలు అన్నపురెడ్డిపల్లి, అస్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకపల్లి, పాళ్వంచ మండలాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విడతలో మొత్తం 1,392 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,11,892 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వివరించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, సీల్స్, ఓటర్ల జాబితాలు, ఫారాలు తదితర అన్ని ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకుని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులకు ముందుగానే శిక్షణ అందించామని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

భద్రతా పరంగా జిల్లా పోలీస్ శాఖతో సమన్వయం చేసి సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చెక్ పోస్టులు, మొబైల్ ప్యాట్రోలింగ్ ద్వారా అక్రమ నగదు, మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కీలక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కాస్టింగ్ ద్వారా ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది అందరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు