News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం, తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలను ప్రకటించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్…

 

తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలను ప్రకటించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం

తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, జూలూరుపాడు గ్రామపంచాయతీకి సంబంధించిన కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామపంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో, మొత్తం సర్పంచ్ స్థానాలలో 10 స్థానాలు ఏకగ్రీవంగా ఖరారైపోయాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

తుది విడతలో మొత్తం 1,330 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 256 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. ఆళ్లపల్లి మండలం అడవి రామవరం గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డు స్థానానికి నామినేషన్ తిరస్కరించబడినందున అభ్యర్థులు లేని కారణంగా, మూడవ వార్డు మరియు ఇల్లందు మండలం బోయ తండా ఆరో వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 1,071 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

తుది విడతలో 1,75,074 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందులో 85,712 మంది పురుషులు, 89,359 మంది మహిళలు, 3 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 1,258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత, పారదర్శక మరియు నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కలెక్టర్ ఓటర్లందరినీ తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు.