News & Views

పెన్షన్ భిక్ష కాదు – ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు

ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు

  • పెన్షనర్లకు జాగ్రత్తే భద్రత
  • జాతీయ పెన్షనర్స్ డే
  • 800 మందితో ఘనంగా పెన్షనర్లతో కరీంనగర్‌లో వేడుకలు

చర్చ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి:- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవ రెడ్డి, ఎలదాసరి లింగయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో కీర్తిశేషులు నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ అనేది భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యం కాదని, 30–35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసిన నకారా న్యాయ పోరాటానికి జిల్లా పెన్షనర్ల సంఘం మరియు తెలంగాణ ఎన్జీవోల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి కల్తీ యుగంలో పెన్షనర్లు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని, పెన్షనర్లు ఎవరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేష్ కుమార్ పెన్షనర్లకు
సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీచరణ్, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. హమీద్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య గౌడ్, రాష్ట్ర, పట్టణ నాయకులు, తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 800 మంది పెన్షనర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 80 మంది సీనియర్ సిటిజన్లను శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. పెన్షనర్లకు భోజన సదుపాయాలు, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఘనంగా గౌరవించినందుకు టీఎన్జీవోల సంఘానికి పెన్షనర్ల సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు.