చర్చ, పెద్దపల్లి: శాంతియుతంగా విజయవంతమైన పంచాయతీ ఎన్నికలు
శాంతియుతంగా విజయవంతమైన పంచాయతీ ఎన్నికలు (ప్రభాత జాగృతి) గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించిన జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది గురువారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. 2025 సంవత్సరానికి నిర్వహించిన రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తైన సందర్భంగా, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో సిబ్బంది చూపిన అంకితభావం, కష్టపడి చేసిన సేవలు, సమన్వయంతో విధులు నిర్వహించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించినందువల్లే ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా పూర్తయ్యిందని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల సిబ్బంది పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీదేవి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల విజయవంతమైన నిర్వహణలో అందరి సమిష్టి కృషి ప్రధాన కారణమని పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.