News & Views

చర్చ,రామగిరి: పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో లక్ష్మీ నగర్ సమస్యలపై ఘాటుగా గళాన్ని విప్పిన పీవీ రావు

రామగుండం కోల్ మైన్‌పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మంథని జెఎన్టీయూహెచ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరైన ఈ కార్యక్రమంలో లక్ష్మీ నగర్ కాలనీ సమస్యలపై సీనియర్ జర్నలిస్ట్ పీవీ రావు అధికారుల ముందే ఘాటుగా గళం విప్పారు. కోల్ మైన్ కార్యకలాపాల కోసం పునరావాసంగా నిర్మించిన లద్నాపూర్ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ (ఫేజ్–1) లక్ష్మీ నగర్ లో మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు లేక మురికి కాల్వలు పొంగిపొర్లుతున్నాయని, తాగునీటి కొరత తీవ్రమైందని, చుట్టూ పెరిగిన సర్కార్ తుమ్మలతో పాములు, దోమల బెడద పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని స్పష్టం చేశారు. సమస్యలు ఏళ్ల తరబడి పేరుకుపోతున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓసీపీ–2 విస్తరణ ప్రాజెక్ట్‌తో ఏర్పడ్డ లక్ష్మీ నగర్ కాలనీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సింగరేణిదే** అని పీవీ రావు స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇక మాటలతో కాదు.. కేవలం చర్యలతోనే న్యాయం చేయాలని తేల్చిచెప్పారు. గ్రామాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని రామగుండం–3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు హామీ ఇచ్చారు. లక్ష్మీ నగర్ ప్రజల తరఫున ధైర్యంగా, నిర్భయంగా సమస్యలను లేవనెత్తిన పీవీ రావు వైఖరి సభలో ప్రత్యేక చర్చనీయాంశంగా నిలిచింది.