చర్చ, కరీంనగర్: ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మందికి షోకాజ్ నోటీసులు
మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలకు విధులు కేటాయించినప్పటికీ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా విద్యాధికారి, గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్ గా విధులు కేటాయించినప్పటికీ సంబంధిత ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అసౌకర్యం ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిసిఏ నియమాల ప్రకారం సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.