News & Views

చర్చ, కరీంనగర్: కాబోయే డాక్టర్లూ..ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడకండి

  • గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రండి
  • పీజీ సీట్ల పెంపు, అందుబాటులో ఫీజులపై ప్రభుత్వాలు ఆలోచించాలి
  • అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చేది డాక్టరే
  • వైద్య విజ్ఝానంపై డాక్టర్లు అప్డేట్ కాకపోతే… డాక్టర్ మాత్ర వైకుంఠ యాత్రే
  • నాపై 109 కేసులున్నాయ్ కాబట్టే హోం శాఖ సహాయ మంత్రినయ్యా
  • ప్రతిమ మెడికల్ కాలేజీ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

 

అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లేనని, అందుకే డాక్టర్లను దైవంగా కొలుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అంతటి పవిత్రమైన వ్రుత్తిలో కొనసాగబోయే వైద్య విద్యార్థులంతా భవిష్యత్తులో ఫార్మా కంపెనీల, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. నిరంతరం వైద్య విజ్ఝానంలో మార్పులు వస్తూనే ఉంటాయని, ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ కాకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ మాదిరిగా డాక్టర్లు మారితే ‘డాక్టర్ మాత్ర రోగుల పాలిట వైకుంఠ యాత్ర’ అవుతుందన్నారు. కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

ప్రతిమ మెడికల్ కాలేజీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంలో మంచి పేరున్న కాలేజీ. 24 ఏళ్లలో ప్రతిమ కాలేజీ ఎంతో ఎత్తుకు ఎదిగి ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రసాదమైందని అన్నారు. గర్భిణీ మహిళలకు ‘‘తల్లి బిడ్డ సంక్షేమ పథకం’’ కింద కేవలం 2 వేల రూపాయలు చెల్లిస్తే ప్రెగ్నెంట్ నుండి డెలవరీ వరకు పూర్తిస్థాయిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోందని ప్రశంసించారు. విద్య, విలువలకు నిదర్శనం ప్రతిమ ఆసుపత్రి అని, అందుకే ఇక్కడ మెడికల్ సీటుకు డిమాండ్ ఉందని అన్నారు.

ఎంబీబీఎస్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ కాదు…5 ఏళ్ల టెస్ట్ మ్యాచ్ అంటూ… మెడికల్ సబ్జెక్టులు అర్ధంకాక నిద్రలేని రాత్రులు, నోట్స్‌తో కుస్తీలు పడతారని, మెడికల్ స్టూడెంట్ జీవితం కంటికి కన్పించని శత్రువుతో యుద్ధం లాంటిదని తెలిపారు. మిగతా విద్యార్థులు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మీరు రాత్రింబవళ్లు చదువులతో బ్రెయిన్ ఓవర్‌లోడ్ అవుతుందని చమత్కరించారు. మీదగ్గరికొచ్చే పేషెంట్లు “డాక్టర్… నన్ను బతికించండి.’అనే అంటారు. ప్రాణం పోసి బతికిస్తే అంతకంటే కాావాల్సిందేముంది? అని అన్నారు. అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన ఇస్తాడు. అందుకు నిదర్శనం నేనేనని… గతంలో ర్యాలీ తీస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళితే… 12 సార్లు షాక్ లు ఇచ్చారని.. 5రోజులు ఐసీయూలో ఉంచి కాపాడారని భావోద్వేగానికి లోనయ్యారు. అందుకే కరీంనగర్ లో డాక్టర్లంటే నాకు అభిమానమని కొనియాడారు. అంతగొప్ప వ్రుత్తిలోకి అడుగు పెట్టబోయే మీరంతా ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఇచ్చే ఆఫర్లకు లోనై వారి వలలో పడితే ప్రజలకు అన్యాయం చేసినవారవుతారని, కోవిడ్ ను ఆసరా చేసుకుని కోట్లు సంపాదించిన ఆసుపత్రులెన్నో ఉన్నాయని, డబ్బులు చెల్లించకపోతే పేషెంట్ల ప్రాణాలను కాపాడకుండా గాలికి వదిలేశాయని గుర్తుచేశారు. కాబోయే డాక్టర్లంతా డాక్టర్ వ్రుత్తిని వ్యాపారంగా కాకుండా మంచి ఆలోచనతో ప్రజలకు వైద్య సేవలందించి ‘ఆరోగ్య భారత్’ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో విద్య, వైద్యం రెండూ ప్రభుత్వాల బాధ్యతేనని, దురద్రుష్టవశాత్తు 1947 నుండి విద్య, వైద్యాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం…మనదేశంలో సరిపడా ఆసుపత్రులు లేవన్నారు. 2025 లెక్కల ప్రకారం…డబ్ల్యూహెచ్ ప్రకారం వెయ్యి మందికి 4 బెడ్లు ఉండాలి. కానీ 140 కోట్ల జనాభాకు సరిపడా బెడ్లు లేవని, మన దగ్గర 1.5 బెడ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇండియాలో 70 వేల ఆసుపత్రులున్నాయని, అందులో 26 వేల ప్రభుత్వ, 43 వేల ప్రైవేట్ ఆసుపత్రులున్నాయని అన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ, WHO లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని, మన దగ్గర 1200 మందికి ఒక డాక్టర్ ఉన్నారని, మన దేశంలో దాదాపు 14 లక్షల మంది మెడికల్ ప్రాక్టీసనర్స్, మరో 20 లక్షల మంది ఆయుష్, యునానీ డాక్టర్లున్నప్పటికి క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా ఎక్కువగా అర్బన్ సెంటర్లకే పరిమితం అవుతున్నారని. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అర్బన్ కే పరిమితమయ్యాయని తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, ఈ అసమానత పోవాలంటె ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాల పరిపాలన లోపాన్ని ఎత్తిచూపారు. డాక్టర్లు కూడా తమ పిల్లలకు అవసరమైన విద్య, ఇతర సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయన్పిస్తే… అక్కడ పని చేయడానికి సిద్దపడతారని, అప్పుడే ఈ అసమానత పోతుందని, డాక్టర్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని సూచించారు.

ఎంబీబీఎస్ అయ్యాక పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఫీజు చాలా ఎక్కువగా ఉందని, ప్రైవేట్ లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఫీజు చెల్లించే స్తోమత లేక ఉన్నత చదువుకు చాలా మంది దూరమవుతున్నారని, దీనిపై చర్చించి ఓ విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఫీల్డ్ లోనైనా కష్టపడి, నిజాయితీగా సేవలందిస్తే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చనీ, రాజకీయాల్లో ప్రజలకు సేవలందిస్తూ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రినయ్యానన్నారు. ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల నాపై 109 కేసులు పెట్టారని, ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షా ఎదుట అడిగితే… ‘‘అందుకే సంజయ్ ను కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి’’ ని చేశామన్నారని చమత్కరించారన్నారు.